తెలంగాణాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలలో ఎక్కువగా తెరాస తిరిగిరావడం ఖాయమని చెప్తుండగా, తాజాగా రెండు సర్వేలు మాత్రం మహాకూటమి గెలుపు ఖాయమని చెబుతున్నాయి. కేసీఆర్ వంటి బలమైన సీఎం ఫేస్ లేనప్పటికీ మిత్రుల బలంతో మహాకూటమికి కలిసి వస్తుందని ఆ సర్వేలు చెబుతున్నాయి. మహాకూటమి సీట్ల పంపకంలో కొన్ని లుకలుకలు ఉన్నప్పటికీ గెలుపు ఖాయమని ఆ సర్వేలు చెబుతున్నాయి.
[m9ad]
50 రోజులలో 100 సభలు పెడతా అని చెప్పిన కేసీఆర్ అందులో 25 రోజులు ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఇదే తమ గెలుపుకు చిహ్నమని మహాకూటమి పక్షాలు అంటున్నాయి. టీడీపీ కాంగ్రెస్ తో వెళ్ళే ధైర్యం చెయ్యదని కేసీఆర్ అంచనా వేశారట. అయితే చంద్రబాబు ఆ దిశగా అడుగులు వెయ్యడంతో ఎన్నికల ముఖచిత్రం మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్ల పంపకం మరి కొంత సాఫీగా జరిగి ఉంటే పరిస్థితులు మహాకూటమికి ఇంకాస్త మెరుగుగా ఉండేవి.
అయితే కేసీఆర్ ఈ నాలుగేళ్ళు మీడియాను బాగా కట్టడి చెయ్యడంతో ఆయన ప్రభుత్వం తిరిగి రాదు అంటే నమ్మలేని పరిస్థితి ఉంది కొన్ని వర్గాల ప్రజలలో. అయినా మహాకూటమికి అనుకూలమైన సంకేతాలు రావడం ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ నేతలంతా ప్రచారంలో తలమునకలై ఉండగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొనలేదు.
పైగా నిన్న ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కిందకు వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తెరాస గెలిచే అవకాశం లేదని ఆయన చెప్పడంతో పార్టీ మారడం ఖాయమనే అనిపిస్తుంది. ఎన్నికలకు దగ్గరలో ఇద్దరు ఎంపీలు పార్టీ మారడమంటే అది సామాన్యమైన విషయం కాదు. సహజంగా తెరాస గెలిచే అవకాశముంటే ఆ పార్టీ నుండి బయటకు రావడానికి నాయకులు ఇష్టపడరు. కేసీఆర్ మళ్ళీ గెలిస్తే తమ జీవితం దుర్భరం అవుతుందని వారికి తెలియనిది కాదు. మహాకూటమి గెలుపునకు ఇది సంకేతమా?



