ప్రగతి భవన్‌ నేర్పుతున్న పాఠాలు… మనకి కూడా వర్తిస్తాయిగా

Pragathi Bhavan

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ వందల కోట్లు ఖర్చు చేసి ఎంతో ముచ్చటపడి వాస్తు ప్రకారం నిర్మించుకొన్న ప్రగతి భవన్‌ను ఖాళీ చేసి తన ఫామ్‌హౌస్‌కి షిఫ్ట్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిలోకి ఏనాడూ ప్రతిపక్ష నేతలను అనుమతించలేదు. చివరికి సొంత మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా లోనికి రానిచ్చేవారు కారు. దానిలో కేసీఆర్ కుటుంబ సభ్యులుగా కేటీఆర్, కవితలు మాత్రమే స్వేచ్ఛగా ఉండేవారు.

అదేవిదంగా వందల కోట్లు ఖర్చు చేసి వాస్తు ప్రకారం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు తీసిపోని విధంగా సచివాలయం నిర్మించుకొన్నారు. దానిలోకి కూడా ఏనాడూ ప్రతిపక్ష నేతలను అనుమతించలేదు. దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని కూడా ఆహ్వానించలేదు. కానీ ఆమె కొన్ని బిల్లులు తొక్కిపెట్టడంతో గత శ్రావణమాసంలో ఆమెను సచివాలయానికి ఆహ్వానించి మర్యాదలు చేశారు.

ADVERTISEMENT

ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే అహంభావం వలన కావచ్చు లేదా అతివిశ్వాసం వలన కావచ్చు ప్రజాధనంతో నిర్మించుకొన్న వాటిని సొంత భవనాలుగా పరిగణిస్తూ వాటిలోకి ప్రతిపక్షాలకు, సామాన్యులను కేసీఆర్‌ అనుమతించలేదు.

తనను కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చే ప్రతిపక్ష నేతలను, ప్రజాప్రతినిధులను గేటు వద్ద పోలీసులతో అడ్డుకొని వెనక్కు తిప్పి పంపించేసేవారు. ఇప్పుడు కేసీఆర్‌ మూటాముల్లే సర్ధుకొని ఆ రెండు భవనాలను ఖాళీ చేసి బయటకు పోకతప్పలేదు. పైగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నన్నాళ్ళు వాటిలోకి కేసీఆర్‌ అడుగుపెట్టలేని దుస్థితి ఎదుర్కొబోతున్నారు. కనుక ప్రజాధనంతో విలాసవంతమైన భవనాలు కట్టుకొన్నప్పటికీ ఏదో ఓ రోజు వాటిని ఖాళీ చేయక తప్పదని స్పష్టమవుతోంది.

అధికారంలో ఉన్నప్పుడు నా అంతటి పోటుగాడు లేడని విర్రవీగితే చివరికి ఏమవుతుందో తెలుసుకొనేందుకు ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఏపీలోని అధికార వైసీపితో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు, వాటి అధినేతలు కూడా దీని నుంచి గుణపాఠం నేర్చుకొంటే వారికే మంచిది. లేకుంటే చివరికి ఇలాంటి అవమానకర ముగింపే వస్తుంది ఎవరికైనా… ఎంతటివారికైనా!

ADVERTISEMENT
Latest Stories