తెలంగాణాలో ప్రతిపక్షం లేకుండా చేద్దాం అనుకున్న తెరాస ప్లాన్ ను పెద్ద దెబ్బ కొట్టారు ప్రజలు. ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికలలో ప్రతిపక్షాలకు ఏడు సీట్లు ఇచ్చి కారు జోరుకు బ్రేక్ వేశారు. అయితే ఆ ఓటమి తెరాసలో మార్పు తెచ్చినట్టుగా కనిపించడం లేదు. మళ్ళీ ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నల్గొండ ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో మరొక శాసనసభ్యుడు తెరాస వైపు మొగ్గు చూపితే సీఎల్పీ విలీనం ప్రక్రియకు మార్గం సుగమం కానుంది.
2018 చివరలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 19 మంది ఎమ్మెల్యేలు హస్తం గుర్తుపై గెలిచారు. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు..తెరాసలో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. మొత్తం కాంగ్రెస్ శాసనసభ్యుల్లో రెండు వంతులు తమ వైపు వస్తే…లెక్క సరిపోతుందని ఎదురు చూస్తున్న అధికార పార్టీకు ఉత్తమ్ రాజీనామా కలిసొచ్చింది. ఇప్పుడు కారు పార్టీ వైపు వెళ్లే ఆ ఒక్క కాంగ్రెస్ శాసన సభ్యుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. దీనికోసమే ఉత్తమ్ రాజీనామా చేసిన వెంటనే దానిని స్పీకర్ ఆమోదించారు.
గతంలో టీడీపీ శాసనసభాపక్షం, కాంగ్రెస్ శాసనమండలి పక్షం ఇలాగే తెరాసలో విలీనమయ్యాయి. ఇది జరిగితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షహోదాను కోల్పోతుంది. సభలో మొత్తం బలంలో పదో వంతు సభ్యులు ఉంటేనే ఆ హోదా దక్కుతుంది. 120 మంది సభ్యులు ఉన్న శాసనసభలో కాంగ్రెస్ కి కనీసం 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇప్పటికే తెరాసకు 91 మంది సభ్యులుండగా… కాంగ్రెస్ నుంచి 12, తెదేపా నుంచి ఒకరు చేరితే ఆ పార్టీ బలం 104కి చేరుతుంది. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు పడిపోతుంది. అప్పుడు కాంగ్రెస్ ను కాదని ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.



