KCR-Jaganఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రెండు మిస్సైల్స్ (క్షిపణులు) సందించేశారు. ఇద్దరూ బడుగు బలహీనవర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు వేర్వేరు పధకాలు ప్రకటించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పధకాలు ప్రకటించగా, తెలంగాణ సిఎం కేసీఆర్‌ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పధకాలు నేటి నుంచే అమలులోకి వస్తుండటం యాదృచ్ఛికమే అయినా వాటి గమ్యాలలో కొంత తేడా ఉంది.

జగన్ ప్రభుత్వం ప్రకటించిన పధకాలు షార్ట్ రేంజ్ మిస్సైల్ వంటివి అంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే పరిమితమైనవి కాగా, కేసీఆర్‌ ప్రయోగించిన గిరిజన రిజర్వేషన్లు లాంగ్ రేంజ్ మిస్సైల్ వంటివి అంటే ఢిల్లీకి గురిపెట్టి సందించినవి.

ఏపీలో సంక్షేమ పధకాల గురించి కొత్తగా చెప్పుకొనేందుకు ఏమీ లేదు. అందరికీ తెలిసినవే. తెలంగాణ సిఎం కేసీఆర్‌ ప్రకటించిన గిరిజన రిజర్వేషన్లకు మాత్రం రాజమౌళి సినిమాకి మించిన పెద్ద ఫ్లాష్ బ్యాక్… మంచి రక్తి కట్టించే ఇమ్మోషనల్ డ్రామా, గొప్ప సస్పెన్స్, ఎవరూ ఊహించలేని క్లైమాక్స్ ఉన్నాయి.

ఫ్లాష్ బ్యాక్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని వర్గాలకు కలుపుకొని రిజర్వేషన్లు 50 శాతం మించడానికి లేదు. కానీ తమిళనాడులో 60 శాతానికి మించి అమలుచేస్తున్నందున తెలంగాణలో కూడా సాధ్యమే అని కేసీఆర్‌ భావించారు. అయితే కేసీఆర్‌ చాలా దూరదృష్టితో ఆలోచించి, దానిలో ముస్లింలకు రిజర్వేషన్ల పెంపును కూడా జోడించి, శాసనసభలో తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వం పోస్టుబాక్సులో పడేశారు. ఊహించినట్లే కేంద్రం స్పందించలేదు. అప్పటి నుంచి టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి కేంద్రాన్ని విమర్శించేందుకు ఆయనకు అవకాశం ఏర్పడింది!

ఇమ్మోషనల్ డ్రామా: సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లుగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ శుక్రవారం రాత్రి జీవో జారీ చేశారని చెపుతూ రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్‌ శ్రేణులు ఆయన చిత్రపఠాలకి పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. సంబరాలు చేసుకొంటున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన జాతీయ పార్టీని ప్రకటించే ముందు రాష్ట్రంలో ఇటువంటి సానుకూల వాతావరణం సృష్టించుకోవడం, ఈవిదంగా తనను తాను ప్రమోట్, హైలైట్ చేసుకోవడం కేసీఆర్‌ తెలివితేటలకు గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

సస్పెన్స్: ఈ తాజా పెంపుతో తెలంగాణలో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. కనుక దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నేడో రేపో హైకోర్టులో పిటిషన్‌ పడటం ఖాయం. ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు ఈ జీవోపై స్టే విధించడం కూడా ఖాయమే. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న తాజా ఉద్యోగాల నోటిఫికేషన్లకు దీనిని వర్తింపజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ జీవో జారీ చేసింది కనుక తప్పకుండా ఆ ప్రయత్నం చేయడం ఖాయం. కానీ అప్పటికి హైకోర్టులో కేసు నడుస్తుంటుంది. కనుక ఈ రిజర్వేషన్లు అమలవుతాయో లేదో తెలీని ఎవరికీ పరిస్థితి.

క్లైమాక్స్: “మోడీజీ… నేను దీని కోసం జీవో జారీ చేస్తున్నాను… కనుక ఓకే చెపుతారో దీంతో ఉరే వేసుకొంటారో మీ ఇష్టం…” అని కేసీఆర్‌ ముందే హెచ్చరించారు. అంటే కేంద్ర ప్రభుత్వం మెడకి ఈ రిజర్వేషన్లను చుట్టారన్న మాట! ఇది కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం కనుక దీనిపై హైకోర్టు కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేసి అభిప్రాయం లేదా నిర్ణయం కోరడం ఖాయం.

ఒకవేళ దీనికి ఓకే చెపితే పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. దేశమంతటా దీనిని అమలుచేయాల్సి ఉంటుంది. అది తేనె తుట్టెను కడిపినట్లే అవుతుంది. అలాగని కుదరదని చెపితే కేసీఆర్‌ ఊరుకోరు. రేపు జాతీయపార్టీ పెట్టి కరీంనగర్‌లో కలిసివచ్చే పార్టీలతో నిర్వహించబోతున్న బహిరంగసభలో ఇదే విషయం గట్టిగా చెప్పి తాను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం రిజర్వేషన్లు తెస్తే మోడీ, బిజెపిలు అడ్డుపడుతున్నారని గట్టిగా వాదించడం మొదలుపెడతారు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో కొత్త విమానంలో ల్యాండింగ్ అవడానికి ఇది మంచి రన్ వేను సిద్దం చేస్తుంది కూడా!

అందుకే ఇది రాజమౌళి సినిమా కంటే గొప్ప డ్రామా, సస్పెన్స్, గొప్ప క్లైమాక్స్ కలిగిన సినిమా వంటిదని, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీపై గురిపెట్టిన లాంగ్ రేంజ్ మిస్సైల్ వంటిదని చెప్పవచ్చు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ మిస్సైల్స్ సందించేశారు కనుక వీటిలో ఏది తమ లక్ష్యాన్ని చేదిస్తాయో చూడాలి.