కేసీఆర్‌ ఫార్ములా ఫెయిల్… మరి జగన్‌ ఫార్ములా?

KCR Jagan

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇద్దరి ఆలోచనలు, పాలనా విదానంలో చాలా తేడా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఇద్దరికీ చాలా దగ్గర పోలికలు, మరికొన్ని విషయాలలో వైరుద్యాలు కనబడతాయి.

“కేసీఆర్‌ అన్నీ నాకు మాత్రమే తెలుసు. నేను మాత్రమే తెలంగాణని, దేశాన్ని ఉద్దరించగలను. నా అంత మేధావి, నిబద్దత గలవారు ఈ భూమండలం మీదనే లేరు…” అన్నట్లు వ్యవహరిస్తుండేవారు. ఈ విషయంలో జగన్‌ వైఖరి కూడా ‘సేమ్ టూ సేమ్’ అని చెప్పక తప్పదు. దీనికి చక్కటి ఉదాహరణ మూడు రాజధానుల ప్రతిపాదనే.

ADVERTISEMENT

కేసీఆర్‌ తనకు నచ్చనివారిని వదిలించుకోవడానికి ఏమాత్రం సంశయించేవారు కారు. కేసీఆర్‌ ‘హేట్ లిస్టు’లో ప్రొఫెసర్ కోదండరామ్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, తన ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఇంకా పలువురు తెలంగాణ ఉద్యమకారులు, చివరికి ప్రధాని నరేంద్రమోడీ త్రిదండి, చిన్న జీయర్ స్వామి కూడా ఉన్నారు.

ఈవిషయంలో జగన్‌ కాస్త సెలెక్టివ్‌గానే వ్యవహరిస్తున్నారనే చెప్పొచ్చు. మోడీ, అమిత్ షాలతో, రాష్ట్ర గవర్నర్‌, స్వరూపానందేంద్ర స్వామిలతో సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తూనే ఉన్నారు.

కేసీఆర్‌తో పోలిస్తే జగన్‌ ‘హేట్ లిస్టు’ చిన్నదే. దానిలో మొట్టమొదటి పేరు చంద్రబాబు నాయుడిదే. రెండో పేరు పవన్‌ కళ్యాణ్‌. ఆ తర్వాత ఈనాడు రామోజీ రావు, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ, నారా లోకేష్‌, ఏపీ టిడిపి నేతలు తదితరులున్నారు.

పలువురు వైసీపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల పేర్లు ఈ ‘హేట్ లిస్ట్’లో లేనప్పటికీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వారిని పక్కన పెట్టేస్తుండటంతో, వారే స్వయంగా ‘హేట్ లిస్ట్’లో చేరిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

కేసీఆర్‌కి నచ్చిన, మెచ్చినవారికి ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకొనేవారు. బహిరంగ సభలు, సమావేశాలలో కూడా వారిని ప్రశంసిస్తూ చాలా గౌరవం చూపేవారు.

జగన్‌ కూడా తన మంత్రివర్గంలో మంత్రుల కంటే ఎక్కువ, వైసీపి ఎమ్మెల్యేల కంటే కాస్త తక్కువగా సలహాదారులను నియమించుకొన్నారు. అయితే వారిలో ఒక్క సజ్జల రామకృష్ణా రెడ్డి సలహాలు తప్ప మరెవరి సలహాలు తీసుకొన్న దాఖలాలు లేవు.

కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి తెలంగాణ, ఏపీ ప్రజలు కూడా చెప్పుకొంటారు. కానీ జగన్‌ స్వయంగా నేను ‘ప్రజల మేలు చేసే వ్యక్తిని’ అని సెల్ఫ్ సర్టిఫై చేసుకొంటారు. ప్రజల నోట వినిపించాల్సిన ఈ మాటని మంత్రుల చేత కూడా చెప్పిస్తూ ‘ఆల్ ఈజ్ వెల్’ అంటూ ఏపీ ప్రజలను జోకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కేసీఆర్‌ అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నిలువునా ముంచేసి దోచేసుకొన్నారని కాంగ్రెస్‌ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నిలువునా ముంచేసి దోచేసుకొంటోందని బీజేపీ, సీపీఐ, సీపీఎం, టిడిపి, జనసేనలు ఆరోపిస్తున్నాయి.

కేసీఆర్‌ తెలంగాణను అభివృద్ధి చేసి చూపినా ప్రజలు ఆయనని తిరస్కరించారు. ఏపీని అభివృద్ధి చేయకపోయినా ప్రజలకు మేలు చేశాను కనుక 175 సీట్లతో మళ్ళీమళ్ళీ గెలిపిస్తూనే ఉంటారని జగన్మోహన్‌ రెడ్డి నమ్మకంగా చెపుతున్నారు.

కేసీఆర్‌ మోడల్ అభివృద్ధి, ఆయన మార్క్ రాజకీయాలు బెడిసికొట్టాయి. కనుక జగన్‌ మార్క్ రాజకీయాలు, కేసులు, సంక్షేమ పధకాలు వైసీపిని గెలిపిస్తాయా? చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories