శబరిమల… రచ్చ రచ్చ స్టేట్మెంట్లు..!

Kerala Women opposing supreme court verdict on sabarimalaభారతావనిలో మహిళలకు అనుమతి లేని పలు ఆలయాల్లో మహిళలకు ప్రవేశాన్ని కోరుతూ సుప్రీంకోర్టులో కేసులు వేసి పోరాడుతున్న తృప్తి దేశాయ్, తాను అయ్యప్పను దర్శించుకునేందుకు త్వరలోనే వెళ్లనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. గతంలో మహరాష్ట్రలోని శనిసింగనాపూర్ లో మహిళల ప్రవేశం కోరి, విజయం సాధించిన ఆమె, భక్తుల నిరసనల మధ్యే, శనీశ్వరుడిని తాకి, దర్శించుకున్న సంగతి తెలిసిందే.

[m9ad]

ADVERTISEMENT

భక్తులు ఆందోళనలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్నారని శనివారం నాడు ఆరోపించిన ఆమె, తాను శబరిమలకు వెళ్లనున్నట్టు చెప్పారు. దీఎంతో ఈ వ్యాఖ్యలపై కేరళవాసులు ఇప్పుడు మండిపడుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పందళ రాజ కుటుంబీకుడు శశికుమార్ వర్మ హెచ్చరించారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే, దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ తరహా ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు.

కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు తగదని, ఆలయ సంస్కృతిని కాపాడేందుకు లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇదిలా ఉంటే…. శబరిమలలోకి మహిళలు ప్రవేశిస్తే, అది ఓ ‘థాయ్ లాండ్’గా మారిపోతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మాజీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు శబరికి రావొద్దని తాను చెప్పబోనని, ఇదే సమయంలో వారిపై ఏ పులో, మనిషో దాడి చేస్తే మాత్రం, ఫిర్యాదులు చేయవద్దని అన్నారు.

కొండపైకి వచ్చే మహిళలకు తాము స్వాగతం పలుకుతామని, ఏదైనా అనర్థాలు జరిగితే మాత్రం తమకు సంబంధం లేదని అన్నారు. మహిళలు కొండపైకి వస్తే దాడులు జరగవచ్చని, వేధింపులూ ఎదురు కావచ్చని హెచ్చరించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, కేరళ వ్యాప్తంగా నిరసనలు జోరందుకున్నాయి. వేలాది మంది రహదారులపై ధర్నాలకు దిగుతుండగా, బీజేపీ, కావాలనే నిరసనలు చేయిస్తోందని కేరళ సర్కారు ఆరోపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories