పార్టీ కండువాలు మార్చిన నాయకులు కనీస విలువలు పాటించకుండా ఇన్నాళ్లుగా తమకు రాజకీయ అవకాశాన్ని కల్పించిన పార్టీని, పార్టీ అధినేతను నోటికి అడ్డు అదుపులేకుండా దూషించడం సమకాలీన రాజకీయాలలో పరిపాటిగా మారిపోయింది.
గడిచిన దశాబ్ద కాలం నుండి విజయవాడ ఎంపీగా టీడీపీ పార్టీ తరుపున ప్రజల మద్దతు సంపాదించిన కేశినేని ఈ ఎన్నికలలో వైసీపీ గూటికి చేరిన విషయం తేలింది. అయితే వైసీపీ తీర్థం పుచ్చుకున్న నాటి నుంచి నాని వైఖరిలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. ”కేశినేని కొడాలిగా రూపాంతరం చెందారా” అన్నట్టుగా టీడీపీ పై, ఆపార్టీ అధినాయకత్వం పై వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడడం లేదు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను ఉద్దేశించి కేశినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. టీడీపీ పార్టీలో చంద్రబాబు, లోకేష్ తమ నాయకులకు టికెట్లు అమ్ముకుంటున్నారని, ఆ టికెట్లు అమ్మిన సొమ్ముతో ఎన్నికలు పూర్తి అయిన తరువాత తట్టా బుట్టా సర్దుకుని పక్క రాష్ట్రం పారిపోతారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అక్కడితో ఆగకుండా…చంద్రబాబు నువ్వు జగన్ ను చూసి బుద్ది తెచ్చుకో లేదా సిగ్గుపడు, ఆయనేమో పేదలకి సీట్లు ఇస్తుంటే మీరేమో తండ్రి కొడుకు కలిసి కోట్లలో సీట్లను అమ్ముకుంటున్నారు అంటూ పూర్తిగా కొడాలిగా మారిపోయారు కేశినేని. ఈ విమర్శలను ఒక్కసారి పక్కన పెట్టి లాజికల్ గా ఆలోచిస్తే కేశినేని వ్యాఖ్యలలో వాస్తవాలు బయటకొస్తాయి.
నిజంగా చంద్రాబు, లోకేష్ టికెట్లు అమ్మే అలవాటే ఉంటే ఇన్నాళ్లుగా టీడీపీ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేయడానికి కేశినేనికి మిఫామ్ ఇచ్చినందుకు బాబుకి కేశినేని ఎంత ముట్టచెప్పారు..? సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎంపీ సీటు ఎంతకు కొన్నారు..? వాళ్ళు ఎంతకు అమ్మారు..? అసలు టీడీపీ లో మీ సీటు రేటంతో చెప్పగలరా..? ఇన్నాళ్లు మీకు ఫ్రీ గా సీటిచ్చిన బాబు ఇప్పుడే అమ్మకాలు మొదలుపెట్టారా..?
కేశినేని గతంలో ప్రజారాజ్యం పార్టీ నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా చిరంజీవి మీద, ఆ పార్టీ మీద ఇదే రకమైన విమర్శలు చేసి పార్టీని దెబ్బతీశారు. ఇప్పుడు అదే ఫార్ములాను నమ్ముకుని టీడీపీ ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనితో కేశినేని నాని వ్యక్తిత్వం బయటపడింది. తనకు సీటు దక్కదు అనుకుంటే పార్టీ మారడం ఆ పార్టీ పై సీట్లు అమ్ముకుంటున్నాడు అంటూ బురద జల్లడం నాని నైజం గా కనపడుతుంది.
ఇక జగన్ విషయానికి వస్తే జగన్ ను చూసి చంద్రబాబు ఎందుకు సిగ్గుపడాలి..?ఇలా రాజకీయ విలువలకు నీళ్ళొదిలేసి నోటికి ఇష్టం వచ్చినదల్లా మాట్లాడి ప్రత్యర్థి పార్టీలో ఉన్నది తలైన, చెల్లైనా సరే అడ్డుఅదుపు లేకుండా తమ పార్టీ నేతలతో మానసిగా దాడి చేపించలేనందుకా..? లేక రాష్ట్రాన్ని తమ రాజకీయ సౌలభ్యం కోసం మూడు ముక్కలు చేయనందుకా..? ఎందుకు సిగ్గుపడాలి..?
పేదలకే జగన్ టికెట్లు ఇస్తున్నాడు అంటూ జగన్ భజన చేస్తున్న కేశినేని పేదవాడా..? వైసీపీ పార్టీలో కార్పొరేటర్ గా పోటీ చేసే స్థాయి నాయకుడి నుండి ఎంపీ స్థాయిలో పోటీకి నిలిచిన ఒక్క పేదవాడిని కేశినేని నాని చూపించగలుగుతారా..? లేక నాని దృష్టిలో వేల కోట్లు ఆస్తి ఉన్నవాళ్లు పేదవాళ్లా..? వైసీపీ అధికారంలోకి వచ్చాక పేద రాజకీయ నాయకుడి అర్ధం మారిపోయినదా అనేలా ఉంటున్నాయి ఆ పార్టీ నేతల విమర్శలు.
కేశినేని నాని విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న గట్టి కౌంటర్ ఇచ్చారు. పండుగ సమయాలలో అధిక ధరలతో బ్లాక్ టికెట్లు అమ్ముకుకోవడానికి అలవాటు పడిన నాయకులకు ఇక అన్ని అమ్మకాలు కొనుగోళ్ల మాదిరే కనపడతాయి అంటూ కేశినేని నాని ని బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాడిగా ముద్ర వేశారు బుద్ధా. గిల్లడం ఎందుకు గిల్లించుకుంటం ఎందుకు నాని గారు. ఇన్నాళ్లుగా అదే పార్టీ అతృపున పోటీ చేసి ఇప్పుడు సీట్లు అమ్ముకుంటున్నారు అంటూ విమర్శలు చేస్తే పోయేది ఆయన పరువే అనేది కేశినేని గ్రహించలేకపోతున్నారా..?




