తొలి రోజు రికార్డ్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయని స్వయంగా అల్లు అరవింద్ చేసిన ప్రకటనతో మెగా ఫ్యాన్స్ మిక్కిలి సంతోషంతో ఉన్నారు. పదేళ్ళ తర్వాత ఎంట్రీ ఇచ్చినా ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగాస్టార్ స్టామినా చాటిందంటూ పండగ చేసుకుంటున్న తరుణంలో… రెండవ రోజు భారీ షాక్ ఇచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రెండవ రోజు దారుణమైన వసూలు సాధించిందని, ఫస్ట్ డే ఆల్ టైం రికార్డు కొట్టిన ఏరియాలలో సైతం సెకండ్ డే బాగా పడిపోయాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
దీనికి కారణం… బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” విడుదల ఒకటి కాగా, రీ ఎంట్రీ మూవీ మెగా ఫ్యాన్స్ ను కూడా పూర్తిగా మెప్పించలేకపోయిందనేది మరో టాక్. సాధారణంగా మొదటి రోజుతో పోలిస్తే… రెండవ రోజు ఎంత గొప్ప సినిమాకైనా కలెక్షన్స్ తగ్గుముఖం పడుతుంటాయి. ఇందులో ఎలాంటి సంశయం లేదు. కానీ, ‘ఖైదీ నంబర్ 150’ విషయంలో మాత్రం 2016లో విడుదలైన ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ తో పోటీ పడుతుండడం విస్మయాన్ని కలిగించే విషయం.
గతేడాది భారీ అంచనాలతో విడుదలై, బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ప్రిన్స్ మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” సినిమా రెండవ రోజు సాధించిన కలెక్షన్స్ ను కూడా కృష్ణా, తూగో వంటి కొన్ని ఏరియాలలో “ఖైదీ” సాధించలేకపోయిందనేది మింగుడుపడని అంశం. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే భారీ ‘డిజాస్టర్’ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సహజంగానే కలెక్షన్స్ దారుణమైన స్థితిలో ఉన్నాయి. కానీ, చిరు సినిమా విషయంలో జరిగింది అది కాదు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగా ఫ్యాన్స్ సృష్టించిన హంగామాకు ‘నెగటివ్’ టాక్ అయితే రాలేదు.
అలాగే సాధారణ ప్రేక్షకులు కూడా ‘సూపర్’ అని చెప్పకపోయినా, ‘బాబోయ్’ అని కూడా అనలేదు. అయినా గానీ ఈ భారీ డ్రాప్ ఊహించినది కాదు. మరో పక్కన “గౌతమీపుత్ర శాతకర్ణి”కి అద్భుతమైన టాక్ తో పాటు ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండడంతో మున్ముందు “ఖైదీ” పరిస్థితి ఏమిటన్నది చూడాల్సి ఉంది. అలాగే మరో ప్రత్యామ్నాయంగా “శతమానం భవతి” కూడా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపధ్యంలో… “ఖైదీ నంబర్ 150” వన్డే వండర్ గా మిగిలిపోతుందేమో అన్న ఆందోళన మెగా అభిమానుల్లో వ్యక్తమవుతోంది.



