అశేష మెగా అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ “ఖైదీ నంబర్ 150” ఫలితం ఏమిటో తెలిసిపోయింది. తొలిరోజు “బాహుబలి” రికార్డులను తుడిచిపెట్టే విధంగా ప్రేక్షకులు నీరాజనం పలకడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఒకటే టాక్… సింపుల్ గా ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలలో ఒక సినిమా ఫలితం ఏంటో తేలిపోయింది. మిగిలిన రెండు సినిమాలలో అందరి దృష్టి బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” వైపునే ఉంది.
చిరు మాదిరిగానే, బాలయ్య కెరీర్ లో 100వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకతను సంతరించుకున్న ఈ సినిమాపై కూడా నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అమరావతి వంటి చారిత్రాత్మకమైన కధ ఉండడం ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ గా మారి, అన్ని వర్గాల ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్ లో “లెజెండ్” అతి పెద్ద విజయం కాగా, ఇప్పుడు ‘శాతకర్ణి’ ఆ సినిమా రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త చరిత్రను లిఖిస్తుందని నందమూరి అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. దర్శకుడు క్రిష్ తో సహా చిత్ర యూనిట్ మొత్తం కూడా సినిమా ఘనవిజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.
‘ఖైదీ’ పోటీని తట్టుకుని బరిలో నిలవగలిగితే మాత్రం, బాక్సాఫీస్ వద్ద ‘శాతకర్ణి’కి భారీ విజయం దక్కే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నది ట్రేడ్ పండితుల మాట. ‘ఖైదీ’ మాస్ సినిమా కావడంతో, ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితం కాగా, ‘శాతకర్ణి’ చారిత్రాత్మక కధ కావడంతో అన్ని వర్గాల వారికి చేరువయ్యే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో ఫస్ట్ షో పడనున్న నేపధ్యంలో ఎలాంటి టాక్ వస్తుందో అన్న ఆసక్తి సినీ జనాలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వ్యక్తపరుస్తున్నారు.
పోటీలో నిలబడి బాలయ్య హిట్టు కొడితే బాక్సాఫీస్ మోత ఏ రేంజ్ లో ఉంటుందో ట్రేడ్ వర్గాలకు తెలిసిందే. నాణానికి మరో వైపున్నట్లు… బాలయ్య సినిమా తేలిపోయిన సందర్భాలలో కూడా బాక్సాఫీస్ వద్ద అంతే దారుణ పరాజయాలు చవిచూసిన పరిస్థితి. దీంతో ‘శాతకర్ణి’ ద్వారా నందమూరి నటసింహం మోత ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.



