తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ శక్తులను ఏకం చెయ్యడం కీలక పాత్ర పోషించారు అనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాకా వ్యూహాత్మకంగా ఆయనను తప్పించారు కేసీఆర్. కోదండరాం కాంగ్రెస్ కి అనుకూలంగా పని చేస్తున్నారని అనుమానించి క్రమేపి ఆయన ప్రతిష్టను తగ్గిస్తూ వచ్చారు తెరాస వారు. దానితో ఆయన సొంతంగా తెలంగాణ జన సమితి అనే పార్టీ పెట్టి ప్రతిపక్షం వైపు జరిగి ఇప్పుడు మహాకూటమిలో భాగస్వామి అయ్యారు.
[m9ad]
టీజెస్ కు ఎలాంటి బలం లేకపోయినా ఆయన ఇమేజ్ ను వాడుకోవడానికి కాంగ్రెస్ ఆయనకు ఎనిమిది స్థానాలు కేటాయించింది. అయితే దానితో సంతృప్తి చెందకుండా 12 సీట్లలో పోటీ చేయబోతున్నాం అని ప్రకటించింది ఆ పార్టీ. సీట్ల పంపకం జరుగుతుండగా మీడియా ముందుకు వచ్చి తన అసంతృప్తిని బయటపెట్టి మహాకూటమిని ప్రజలలో పల్చన చేసారు ఆయన. కోదండరాం ఏం చేసినా పొత్తు కోసం భరిస్తున్నాయి మహాకూటమి వర్గాలు.
అయితే ఇప్పుడు వాస్తవంగా కోదండరాం సొంతంగా గెలిస్తే గొప్ప అన్నట్టు ఉంది పరిస్థితి. ఆయన జనగామలో పోటీకి సిద్దం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో టీజేఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు కోదండరాం ఇక్కడే నివాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిబట్టి ఆయన సొంత సీటు కోసం తిప్పలు పడటం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఆయన వేరే నియోజకవర్గాలకు వెళ్ళి మహాకూటమి అభ్యర్థులకు ఏం ప్రచారం చేస్తారు? కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీలు జరిగితే ఆ సీట్లలో తెరాస లో లాభం అలాగే మిగతా స్థానాలలో ఓట్ల ట్రాన్సఫర్ జరగదు. మరోవైపు కోదండరాం సమీప బంధువులు జనగామలోనే మకాం వేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు గుర్తింపు పొందిన ప్రముఖులను కలసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఈ నెల 19న కోదండరాం నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయని కదనం.



