కొందరికి సన్ స్ట్రోక్.. కొండా సురేఖకు డాటర్ స్ట్రోక్!

Konda Susmitha Controversy Puts Konda Surekha Under Pressure

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు కొండా సుస్మిత తొందరపాటు ఆమె తల్లి కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉంది. సిఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు, ఆరోపణలకు సంజాయిషీ కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి, వారి కుమార్తె కొండా సుస్మిత ముగ్గురూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. ఆమె తల్లి కొండా సురేఖ మంత్రి పదవిలో ఉన్నారు. పైగా సిఎం రేవంత్ రెడ్డికి సన్నిహితవర్గంలో ఆమె కూడా ఒకరు.

ADVERTISEMENT

కానీ ఆమె భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే అసంతృప్తి వారికి ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి అసంతృప్తితో రగిలిపోతున్నవారు చాలా మందే ఉన్నారు.

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇందుకు చక్కటి ఉదాహరణ. కానీ ఆయన పార్టీలో చాలా సీనియర్ కనుక సిఎం రేవంత్ రెడ్డిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని విమర్శలు చేసినా నడుస్తోంది.

కానీ కొండా సుస్మిత ఇంకా ఒక్కసారి కూడా ఎన్నికలలో పోటీ చేయలేదు. కనుక వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకోవడం తప్పు కాదు.

కానీ తమ పరకాల సీటుని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి రేవూరి ప్రకాష్ రెడ్డికి కట్టబెట్టాలనుకోవడంతో ఆమె ఆగ్రహంతో సిఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

గత కొన్ని వారాలుగా బీఆర్ఎస్‌ నేతలు సిఎం రేవంత్ రెడ్డి.. సోదరులపై చేస్తున్న ఆరోపణలనే ఆమె కూడా చేశారు. ఆమె మాట్లాడిన భాష, పదజాలం కూడా బీఆర్ఎస్‌ భాషనే పోలి ఉంది. కనుక ఆమె వెనుక బీఆర్ఎస్‌ పార్టీ ఉందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

అయితే రాష్ట్ర విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొండా దంపతులను నడిరోడ్డుపై విడిచిపెట్టి వెళ్ళిపోతే, వారు బీఆర్ఎస్‌ పార్టీలో చేరి అక్కడ అవమానాలు భరించలేక తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగివచ్చారు.

కొండా సురేఖకు సిఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తున్నప్పుడు అది గుర్తించాలి కదా? కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఉచ్చులో చిక్కుకొని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి రాదు. సుస్మితకు పరకాల సీటు రాదు. కానీ తల్లి కొండా సురేఖ మంత్రి పదవి ఊడుతుంది! అప్పుడు నష్టపోయేది ఎవరు?

అప్పుడు తమ కుటుంబం పరిస్థితి ఏమిటి? మళ్ళీ బీఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్ళాల్సి వస్తే అక్కడ ఇంతకంటే గొప్ప గౌరవం లభిస్తుందా? అని ఆలోచించుకోవాలి కదా?

కానీ రాజకీయాలలో ఇంకా తొలి అడుగు వేయక మునుపే కొండా సుస్మిత ఈవిధంగా మాట్లాడి తల్లి మంత్రి పదవి కూడా ఊడగొట్టుకోవడం వివేకమా?

ADVERTISEMENT
Latest Stories