కోట్ల చేరిక… టీడీపీకి ప్లస్సా మైనస్సా?

Kotla Jayasurya Prakasha Reddy to Meet Chandrababu Naiduకర్నూల్ జిల్లా కు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన టీడీపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబును ఆయన ఈరోజు రాత్రి భోజనానికి కుటుంబంతో సహా కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుని ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ కానున్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తుండగా ఆయన కర్నూల్ ఎంపీగా పోటీ చేసి లక్షా పది వేల ఓట్లు తెచ్చుకున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల తో పాటు, కర్నూల్ పార్లమెంట్ లో ఆయన పార్టీ విజయాన్ని ప్రభావితం చెయ్యగలరు. దానితో ఆయనను పార్టీలోకి తీసుకుని రావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నించారు. అయితే టీడీపీ వైపే కోట్ల మొగ్గు చూపించారు. జగన్ వైఖరి సరిపడక ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కోట్ల చేరిక వల్ల కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు.

ADVERTISEMENT

కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో మూడు శాసనసభ స్థానాలను తన వర్గానికి కేటాయించాల్సిందిగా సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే ఇన్ని సీట్లు కేటాయిస్తే మాత్రం ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కర్నూల్ ఎంపీ సీటు ఇప్పటికే వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వచ్చిన బుట్టా రేణుకకు చంద్రబాబు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ సీటు ఖచ్చితంగా కోట్లకు ఇవ్వాలి.

దీనితో ఆవిడను అసెంబ్లీకి పంపాలి. వేరే సీట్లలో కూడా సర్దుబాట్లు చెయ్యాలి. అయితే కోట్ల వంటి పెద్ద నాయకుడు వస్తున్నప్పుడు ఇటువంటి సర్దుబాట్లు తప్పవు. ఈ చేరిక ఉపముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తికి ఖచ్చితంగా రుచించదు ఇప్పుడు ఆయనను కూడా సముదాయించాలి. టీడీపీ బలహీనంగా ఉన్న కర్నూల్ జిల్లాలో ఈ చేరికతో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే పాత కొత్త వారితో సమన్వయం చేసుకోగలిగితేనే ఇది సాధ్యం అవుతుంది. చంద్రబాబు ఏం చెయ్యబోతున్నారు చూడాలి.

ADVERTISEMENT
Latest Stories