రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమవ్వాలని, అవి వ్యక్తిగత ద్వేషాలుగా మారకూడదు, మిగలకూడదు అని చరిత్రలో ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఆచరించి ఆదర్శప్రాయులుగా నిలిచారు.
అయితే నేటి సమకాలీన రాజకీయాలలో అటువంటి రాజకీయ సూత్రాలను పాటించే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ కరువై పోయారనే చెప్పాలి. పార్టీ అధినేతల నుంచి కింద స్థాయి నాయుకులు, ఆయా పార్టీల క్యాడర్ వరకు అందరు ఇదే ధోరణిలో రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఘటనలు టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ఎక్కువగా దర్శనమిస్తాయి.
రాజకీయం అంటే రెండు పార్టీల మధ్య సాగే సైద్ధాంతిక పోరు అనేలా కాకుండా ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు కుటుంబాల మధ్య రేగే సరిహద్దు కొట్లాటలు మాదిరి ముఖ ముఖాలు చూసుకోవడానికి కూడా అంగీకరించలేని సందర్భాలను చూస్తున్నాం.
ఇటువంటి పరిస్థితుల మధ్య నేడు గులాబీ, కాషాయం అంటూ ఉప్పు నిప్పు మాదిరి రాజకీయ విమర్శలు చేసుకునే బీజేపీ నేత బండి సంజయ్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల మధ్య ఒక సరదా ఆసక్తి సంఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలం అయినా జిల్లాల సందర్శన లో భాగంగా సిరిసిల్ల జిల్లాకు వెళ్లిన బిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కు అనుకోకుండా అక్కడ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కనిపించారు.
దానితో కేటీఆర్, బండి ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, కాసేపు నవ్వుతూ పలకరించుకున్నారు. దీనితో అక్కడున్న బిఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ క్యాడర్ ఎవరి నాయకుడికి వారు జై జై లు కొట్టుకుంటూ ఆ దృశ్యాన్ని చూసి ఆనందించారు.
అయితే రాజకీయాలలో ఇటువంటి స్నేహ పూర్వక పలకరింపులు చూసేందుకు ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తాయి. అలాగే రోజులు గడిచే కొద్దీ ప్రత్యర్థి పార్టీ నాయకుల కలయికల మీద ఎన్నో గుసగుసలు, ఊహాగానాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వస్తాయి.





