నేడు తెలంగాణలో జరుగుతున్నదే రేపు ఏపీలో కూడా…

KTR-Protest

అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే ఏమవుతుందో తెలుసుకోవడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం, సర్వేలు అవసరం లేదు. పొరుగు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని, దాని అధినేత కేసీఆర్‌ని చూస్తే చాలు.

ADVERTISEMENT

రెండు దశాబ్ధాలకు పైగా తెలంగాణ రాజకీయాలను శాశించిన కేసీఆర్‌ నేడు శాసనసభలో సిఎం రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ మంత్రులను ఎదుర్కోలేక మొహం చాటేస్తున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకపోవడంతో కుంటి సాకులతో వాకవుట్ చేసి సమావేశాల నుంచి బయటకు పారిపోతున్నారు!

ఒకప్పుడు కేసీఆర్‌ ప్రతిపక్ష నేతలను, ఎమ్మెల్యేలను సచివాలయంలోకి, ప్రగతి భవన్‌లోకి అడుగుపెట్టనీయకుండా చేస్తే, ఇప్పుడు మాజీ మంత్రులు కేసీఆర్‌, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో నేలపై కూర్చొని ధర్నా చేయాల్సిన దుస్థితి కలిగింది!

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా బిఆర్ఎస్ హయాంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలోలో అవినీతి, ధరణి పోర్టల్‌ అడ్డుపెట్టుకొని చేసిన భూకబ్జాలు, తాజాగా సచివాలయం నిర్మాణంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్‌ ప్రభుత్వం తవ్వితీసి, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావుల మెడకు చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రెండు దశాబ్ధాలు తెలంగాణ రాజకీయాలను, కుదిరితే దేశ రాజకీయాలను కూడా శాశించాలనుకున్న అపర చాణక్యుడు కేసీఆర్‌ పరిస్థితే ఇలా ఉంటే, రాబోయే ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే, జగన్, మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏవిదంగా ఉండబోతోంది?ఐదేళ్ళ పాలనలో అభివృద్ధి చేయలేదు కనుక ఆ పేరుతో అవినీతికి పాల్పడలేదు. కానీ మిగిలినదంతా అవినీతి, అక్రమాల పుట్టలే కదా?

కనుక ఎన్నికలలో వైసీపి ఓడిపోతే ప్రతీ ఒక్కరూ ఇంతకు ఇంతా మూల్యం చెల్లించక తప్పదని, వారి అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతున్న అధికారులపై కూడా చట్టపరంగా కటినచర్యలు తప్పవని టిడిపి యువనేత నారా లోకేష్‌ ‘ఎర్ర డెయిరీ’ని చూపిస్తూ హెచ్చరిస్తూనే ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇంతకు ఇంత తప్పదని స్పష్టంగానే హెచ్చరిస్తున్నారు.

కనుక నేడు తెలంగాణలో జరుగుతున్నదే రేపు ఏపీలో కూడా జరుగబోతోందని, అంతకంటే మరికాస్త ఎక్కువే తప్ప తక్కువ ఉండదని స్పష్టం అవుతోంది.

ఒకవేళ ఎన్నికలలో వైసీపి గెలిచి జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అప్పుడు టిడిపి, జనసేన నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.

కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? అంటే అధికారంలో ఉన్నప్పుడు పాలకులు ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే భ్రమతో గర్వం, అహంకారంతో విర్రవీగుతూ ప్రతిపక్షాలను అణగదొక్కేస్తూ, అవినీతి, అక్రమాలకు పాల్పడుతుండటం వలననే! ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే ఎన్నడూ, ఎవరికీ ఇటువంటి దుస్థితి వచ్చేదే కాదు!

ADVERTISEMENT
Latest Stories