గజిని సినిమాలో హీరో ‘షార్ట్ మెమొరీ లాస్’ సమస్యతో బాధపడుతూనే దానిని అధిగమించి శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అందుకోసం వారి పేర్లు, ఫోటోలు, వివరాలు ఏర్పాటు చేసుకుంటాడు.
కానీ మన రాజకీయ నాయకులకు అలాంటి ‘మెమొరీ లాస్’ సమస్య లేనప్పటికీ ఉన్నట్లు మాట్లాడుతుంటారు. గజినీలా తమ హయంలో చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలు, జరిగిన పొరపాట్లను కాగితాల మీద వ్రాసుకోకపోయినా, అవన్నీ గుర్తుండే ఉంటాయి. కానీ గుర్తులేనట్లు మాట్లాడుతుంటారు. అధికార పార్టీలని, రాభుత్వాలని, ముఖ్యమంత్రులను విమర్శిస్తుంటారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న విద్యార్ధులతో కలిసి నీట్ వివాదంపై ధర్నాలో పాల్గొనడం, ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు ఆవిధంగానే ఉన్నట్లనిపిస్తుంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిన్న మీడియా సమావేశం నిర్వహించి, కేటీఆర్‌కి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు.
1. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీక్ అయితే, మీరు, సిఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు రాజీనామాలు చేయలేదు? టిజీపీఎస్సీ నిర్వాకం వలన లక్షల మంది విద్యార్ధులు నష్టపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
2. మీ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలకు పాల్పడటం వలన 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి మీరు ఎందుకు నైతిక బాధ్యత వహించలేదు?
3. అధికారంలో ఉన్నపుడు విద్యార్ధుల జీవితాలతో ఆడుకొని ఇప్పుడు నీట్ సమస్యఫై విద్యార్ధులతో కలిసి ధర్నా చేయడం, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరడం ఏ రకం రాజకీయం? అని బండి సంజయ్ అడిగిన ప్రశ్నలు విన్నప్పుడు, కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేసేందుకు మొదట ఎందుకు వెనకాడిందో అర్ధమవుతుంది.
కానీ ఈ అంశం పట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దూసుకుపోతుండటం చూసి, కాంగ్రెస్ నేతలు బిజేపి-బీఆర్ఎస్ మద్య రహస్య అవగాహనా ఉందని తమని నిందిస్తుండటంతో, తప్పని పరిస్థితిలో కేటీఆర్ విద్యార్ధులతో కలిసి ధర్నాలో పాల్గొని ఉండవచ్చు.
ధర్నాలో కేటీఆర్ నవతరం, యువతరం, రాజ్యమా మేలుకో.. అంటూ చాల ఆవేశంగానే మాట్లాడారు. కానీ బండి సంజయ్ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పగలరా?





