
కేటీఆర్ కు హరీష్…లోకేష్ కు పవన్..?
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇద్దరు రాజకీయంగా ఒకే రకమైన సమస్యను ఎదుర్కుంటున్నారు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు చంద్రబాబు ఈ ఇద్దరు చంద్రులు కూడా తమ రాజకీయ వారసుల ప్రకటన విషయంలో ముందడుగు వేయలేని పరిస్థితుల మధ్య చిక్కుకున్నారా.? అన్న సందేహం ఇరు పార్టీల క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది.
Also Read – బిఆర్ఎస్ బతకాలి అంటే ఏపీ చావాలా.?
2018 లో రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజకీయ వారసుడిగా, బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా కేటీఆర్ ను ప్రకటించబోతున్నారు అంటూ ప్రచారాలు బయటకి వచ్చినప్పుడల్లా బిఆర్ఎస్ పార్టీలో చీలిక రానుంది,
హరీష్ రావు కేసీఆర్ ని వీడి సొంత కుంపటి పెట్టబోతున్నారు, తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయంటూ అటు సోషల్ మీడియా మొదలుకుని ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు కథనాలు ప్రచురితమయ్యాయి. అలాగే 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ పేరు మార్పుతో పాటుగా పార్టీ నాయకత్వం కూడా మారబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
Also Read – యావత్ దేశం దృష్టి విశాఖ పైనే…
ఈ ప్రచారం ఒకరకంగా బిఆర్ఎస్ ఓటమికి కూడా కారణమయ్యింది అనే టాక్ తెలంగాణ రాజకీయాలలో గట్టిగానే నడిచింది. ఇక ఇప్పుడు కూడా త్వరలో కేసీఆర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి పార్టీలో తన స్థానాన్ని, పార్టీ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించబోతున్నారు అనే వార్తలు ఊపందుకున్నాయి.
అయితే మొన్న జరిగిఆన్ బిఆర్ఎస్ 25 వసంతాల వేడుకలో కేసీఆర్ ఆ దిశగా పార్టీ క్యాడర్ను ఉద్దేశించి ఒక ప్రకటన చేస్తారు అంటూ అందరు ఆసక్తిగా గమనించారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ ప్రకటనతో పార్టీలో మొదలయ్యే అంతర్గత విభేదాల దృష్ట్యా బిఆర్ఎస్ రాజకీయ వారసుడి పై ఎటువంటి ప్రకటన చేయలేకపోయారు.
Also Read – జగనన్న రాజకీయ ప్రవచనాలు…
ఇక ఆంధ్రపదేశ్ లోని తెలుగు దేశం పార్టీ విషయానికొస్తే టీడీపీలో కూడా లోకేష్, చంద్రబాబు కి మధ్య ఇంచుమించు ఇదే సమస్య వెంటాడుతుంది. 2024 ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాల్గవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు తన రాజకీయ వారసుడిని ప్రకటించడానికి కాస్త వెనకాడుతున్న మాట వాస్తవమే.
టీడీపీ పార్టీ పగ్గాలను లోకేష్ చేతిలో పెట్టాలి, టీడీపీ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ టీడీపీ నాయకులు బహిరంగ ప్రకటనలే చేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ తన భవిష్యత్ నాయకుడిని ప్రకటించడానికి, పవన్ కళ్యాణ్ ఒక అడ్డంకిగా మారారు అనేది ఏపీ రాజకీయాలలో నడుస్తున్న టాక్.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో పార్టీ అధికారంలోకి రావడంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పని చేయడానికి ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్కసారి టీడీపీ కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ ప్రకటన వస్తే, అది కూటమి పొత్తును విచ్ఛిన్నం చేయగలదు అనే ఆందోళన అటు పార్టీ అధినేతగా చంద్రబాబు ను వెంటాడుతుంది.
మరో పదేళ్లు ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి అనుభవం అవసరం, రాజధాని అమరావతి నిర్మాణానికి ఆయన విజనరీ ప్రాణవాయువు మాదిరి పని చేస్తుంది అంటూ పవన్ మరోపక్క నొక్కివక్కాణిస్తున్నారు. అలాగే తానూ బాబు నాయకత్వంలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నానంటూ పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించి తన పార్టీ క్యాడర్ను మానసికంగా కూటమి పొట్టను మరో ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.
అయితే ఇటువంటి సమయంలో లోకేష్ ముఖ్యమంత్రిగా, ఆయన నాయకత్వంలో మంత్రిగా పవన్ పనిచేయడాన్ని జనసేన క్యాడర్ సమ్మతిస్తుందా.? అలాగే లోకేష్ నాయకత్వానికి మద్దతిచ్చి కూటమిని కొనసాగించడానికి ఇటు పవన్ కానీ అటు బీజేపీ కానీ ముందుకొస్తుందా.? అన్న సందేహాలు టీడీపీ అధిష్టానాన్ని వెంటాడుతున్నాయి.
ఇలాంటి సమయంలో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ టీడీపీ నుంచి ప్రకటన వస్తే పొత్తులో చీలిక ఏర్పడడం అనివార్యమవుతుంది, తద్వారా వైసీపీ రాజకీయంగా లాభపడే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఇరు పార్టీలకు అత్యంత ప్రమాదకరం, అలాగే ఏపీ రాష్ట్ర భవిష్యత్ కు ప్రాణ సంకటం.
దీనితో అటు కేటీఆర్ కు హరీష్ ఘండం, ఇటు లోకేష్ కు పవన్ భయం రెండు కూడా కేసీఆర్, చంద్రబాబు వారసుల ప్రకటనను వెనక్కినెట్టేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అనధికార పార్టీ అధినేతలుగా ఈ ఇద్దరు చంద్రుల తనయులు పార్టీని నడుపుతున్నప్పటికీ అధికారిక పట్టాభిషేకం కోసం ఇరు పార్టీల క్యాడర్ ఆశగా చూస్తున్నారు.