
లోకం అంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కి ఐటి కంపెనీలను తెచ్చారని, ఐటి రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఒప్పుకుంటుంది ఒక్క కేసీఆర్ తప్ప. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ మన అందరిదీ అనే భావనతో సీమా జిల్లాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం తమ సీమని పట్టించుకోకుండా హైదరాబాద్ నగరాభివృద్ధికి యధాశక్తిన కృషి చేశారు.
ఆ కారణంగానే రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్కటే అంతగా అభివృద్ధి చెందింది. మిగిలిన నగరాలు, పట్టణాలు అన్నీ వెనుకబడి పోయాయి. రాష్ట్ర విభజనలో కామధేనువు వంటి హైదరాబాద్ తెలంగాణకు దక్కడంతో ఆ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోగా, విభజిత ఆంధ్రప్రదేశ్ కధ మళ్ళీ మొదటికొచ్చింది. ఇదంతా అందరికీ తెలుసు.
అయితే దొర లక్షణాలు కలిగి, నిజాం నవాబులను ఆరాదించే కేసీఆర్, నిజాంకాలం నాటికే హైదరాబాద్ అన్ని విధాలా అభివృధ్ది చెందిందని, కాంగ్రెస్, టిడిపీలు కొత్తగా చేసిందేమీలేదని వితండవాదం చేసేవారు.
చంద్రబాబు నాయుడు వేసిన ఐటి పునాదుల మీదే కేటీఆర్ ఆ రంగాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ పోయారు. కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి చేశారని ఒప్పుకోవడానికి కేసీఆర్, కేటీఆర్‌లకు మనసు రాలేదు.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
అయినా కేసీఆర్, కేటీఆర్ ఒప్పుకోనంత మాత్రాన్న చంద్రబాబు నాయుడు గురించి ఎవరికీ తెలియకుండా పోదు. ఆయన కీర్తిప్రతిష్టలు తగ్గిపోవు కూడా.
జగన్ ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్‌తో సహా ప్రపంచదేశాలలో ఎంతమంది ఐటి నిపుణులు రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారో అందరూ చూశారు.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ అధికారులు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెడితే తెలంగాణలో ఒక్కరూ కూడా స్పందించలేదు. చివరికి కేసీఆర్ కూడా మౌనంగా ఉండిపోవలసి వచ్చింది.
ఇంతకీ విషయం ఏమిటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు క్రుంగిపోవడం, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు గోడలు పగుళ్ళు ఇచ్చి నీళ్ళు లీక్ అయిపోతున్నాయి. వాటి గురించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఎంత వితండవాదం చేస్తున్నప్పటికీ, వాస్తవాలు కళ్లెదుట అంత స్పష్టంగా కనిపిస్తుండటంతో తెలంగాణ ప్రజలు కూడా వారిపై ఆగ్రహంగా ఉన్నారు.
ఇప్పుడు వారి మెడకి మరో అపవాదు చుట్టుకుంది. నాగార్జునసాగర్ సమీపంలో సుంకీశాల వద్ద నిర్మిస్తున్న పంప్ హౌస్‌లోకి నీళ్ళు రాకుండా నిర్మిచిన 40 అడుగుల కాంక్రీట్ గోడ కూలిపోవడంతో మళ్ళీ ముగ్గురూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వాటికి జవాబు చెప్పుకునే ప్రయత్నంలో కేటీఆర్ చరిత్ర పాఠాలు చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు ఎలిమినేటి మాధవ్ రెడ్డి ప్రాజెక్టులో మొదటి దశని పూర్తిచేసి హైదరాబాద్‌కు 90 మిలియన్ గాలన్ల నీళ్ళు తెచ్చారని చెప్పేశారు. అని అనే కంటే ఒప్పేసున్నారని చెప్పుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అదే ప్రాజెక్టులో మరో రెండు దశలు ప్రారంభించి నగరానికి మరో 90 మిలియన్ గాలన్ల నీళ్ళు తెచ్చేందుకు కృషి చేశారని కేటీఆర్ మళ్ళీ ఒప్పేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకీశాలకు తానే స్వయంగా శంకుస్థాపన చేశానని కేటీఆర్ చెప్పారు.
ఆంధ్రా నేతలు తెలంగాణను దోచుకున్నారని ఎప్పుడూ విమర్శించడమే తప్ప తెలంగాణకు వారు చేసిన మేలు గురించి చెప్పడానికి కేసీఆర్, కేటీఆర్ ఎన్నడూ ఇష్టపడరు. కానీ సుంకిశాలలో జరిగిన ప్రమాదంతో తమకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు చేసిన మేలు గురించి కేటీఆర్ చెప్పేశారు. మరి కేటీఆర్ ఈ విషయం బాపూకి చెప్పారో లేదో?లేకుంటే బాపూకి కోపం రావచ్చు.