తెలంగాణ ఉద్యమ సమయంలో అందరినీ కలుపుకుపోయిన కేసీఆర్, రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కాగానే అందరినీ పక్కన పెట్టి నియంతలా పాలించారు. రాష్ట్రంలో మరో పార్టీ, మరో గొంతు వినపడకూడదన్నట్లు ప్రతిపక్షాలను బలహీనపరిచి నిర్వీర్యం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారనే కీర్తిని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనే అపకీర్తి మింగేసింది. అందువల్లే ప్రజలు ఆయనని కాదనుకొని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.
కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవన్నీ మరిచినట్లు సిఎం రేవంత్ రెడ్డిని హిట్లర్‌తో పోల్చుతూ, అలాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు?నువ్వెంత?అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నారు.
కానీ తాను ‘హిట్లర్ నియంత పాలన’ గురించి మాట్లాడితే ఎవరికైనా మొదట గుర్తు వచ్చేది తన తండ్రి కేసీఆరేనని, అందువల్లే ఆయన కాల గర్భంలో కలిసిపోతున్నారనే సంగతి మరిచిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నారు.
సిఎం రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేందుకు హైడ్రాతో సహా అనేక అంశాలున్నాయి. లేదా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ పాలనలో తేడాల గురించి చెప్పుకుంటూ ప్రజలను ఆకట్టుకోవచ్చు.
కానీ తమను అధికారానికి దూరం చేశారని సిఎం రేవంత్ రెడ్డిపై పగతో రగిలిపోతూ ఆయనని తీవ్రంగా విమర్శించాలని హిట్లర్-నియంత పాలన గురించి కేటీఆర్ మాట్లాడితే, అది ప్రజల గాయాలను మళ్ళీ కెలికి గుర్తు చేసినట్లవుతుంది. దీని వలన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పడే ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంటుంది.




