హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌ని గెలిపించేది కాంగ్రెస్‌ పార్టీయేనట!

KTR Says Congress Itself Will Help BRS Win

కాంగ్రెస్‌ పార్టీ తనని తాను ఓడించుకున్నప్పుడే ఇతర పార్టీలు గెలుస్తుంటాయనే ఓ చక్కటి నానుడి ఉంది. అది నిజం కూడా. తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటారు. ఆరేడు నెలల క్రితం బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి అలాగే ఉండేది కూడా. కానీ అనూహ్యంగా చాలా తక్కువ సమయంలోనే కోలుకుంది.

కేటీఆర్‌ తాజా ఇంటర్వ్యూలో ఈసారి తమని కాంగ్రెస్‌ పార్టీయే గెలిపిస్తుందని చెప్పారు. అంటే ముందు చెప్పుకున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ తనని తాను ఓడించుకోబోతోందనుకోవచ్చు.

ADVERTISEMENT

ఇందుకు కేటీఆర్‌ బలమైన కారణాలే చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో సిటీ బస్ ఛార్జీలు రూ.5 నుంచి 10 వరకు పెంచారు. అంతకు ముందు విద్యార్ధుల బస్ పాసుల ఛార్జీలు భారీగా పెంచింది. కనుక మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఆ సొమ్ముని వారి భర్తల నుంచి, పిల్లల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వసూలు చేసుకుంటోందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకుంటున్న మహిళలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ పధకం వలన ఆదాయం కోల్పోయిన ఆటోరిక్షా డ్రైవర్లు కూడా ఈ సారి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం ఖాయమని కేటీఆర్‌ అన్నారు.

హైడ్రా కూల్చివేతలు కూడా నగర ప్రజల ఆగ్రహానికి మరో కారణం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం పలుమార్లు జలమయం అయ్యింది. ఆ కారణంగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనదారులు, లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళలోకి నీళ్ళు చేరడంతో ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసహనంగా ఉన్నారు.

ఈ నేపధ్యంలో నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక జరుగబోతోంది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు జరుగబోతున్నాయి.

కాంగ్రెస్‌ ప్రభంజనం చాలా బలంగా ఉన్నప్పుడే 2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ హైదరాబాద్‌లో గెలిచిందని, ఇప్పుడు బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడిందని కేటీఆర్‌ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అనుచిత విధానాలు, వైఫల్యాలు, అసమర్దతే తమ పార్టీ పరిస్థితిని మెరుగుపరిచాయని కేటీఆర్‌ అన్నారు. అవునో కాదో నవంబర్‌ 14న జూబ్లీహిల్స్‌ ఫలితాలు వస్తే తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories