కల్వకుంట్ల కుటుంబంలో అందరూ మంచి మాటకారులే. ఇందుకు మరో తాజా ఉదాహరణ జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఇచ్చిన సమాధానం కనిపిస్తోంది.
“భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. పార్టీలు పెట్టుకొని ఎన్నికలో పోటీ చేయవచ్చు. అందువల్లనే జనసేన శాసనసభ, మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసింది కదా? మిమ్మల్ని, మీ పార్టీని ఎవరు వద్దన్నారు? ప్రజలే కదా?
మీరు ఒక చోట పార్టీ పెట్టుకునేటప్పుడు అక్కడి ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు, సమస్యలు, ఉద్యమాలు, పోరాటాలు వంటివన్నిటి గురించి అవగాహన చేసుకోవాలి. ఆ మనుషులను, వారి సంస్కృతీ సంప్రదాయాలను, ఆ గడ్డని ప్రేమించగలగాలి.
కానీ నేటికీ తెలంగాణ ఏర్పాటు చేసిన విధానం తప్పు పడుతూనే మళ్ళీ తెలంగాణలో బరాబర్ పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయనకు తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదనుకుంటే ఈ డొంక తిరుగుడు దేనికి? అదే ముక్క నేరుగా చెప్పేయొచ్చు కదా?
ప్రాంతీయవాదం ఉగ్రవాదమన్నారు. మరి ఆనాడు పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం కూడా ప్రాంతీయవాదమేనా? తెలంగాణ మీ అయ్య జాగీరా? అని అడిగారు. అవును ఇది మా భూమిపుత్రుల జాగీరే. ఈ జాగీరుని కాపాడుకోవడానికి మాకు కేసీఆర్ ఉన్నారు. ఆయనే మా తెలంగాణకు ఓజీ. అయన ఒక్కరే చాలు మాకు,” అంటూ కేటీఆర్ ఇంకా చాలా మాట్లాడారు.




