బిఆర్ఎస్ ఓటమి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ బాధ్యతలను అనధికారికంగా కేటీఆర్ చేతికి అప్పగించిన కేసీఆర్ తెరవెనుక తనయుడు కేటీఆర్ నాయకత్వాన్ని బలపరిచే కార్యక్రమం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయ బలాలు, బలహీనతలు కేటీఆర్, కేసీఆర్ లతో పాటుగా ప్రత్యర్థి పార్టీల నేతలకు కూడా తెలిసొస్తుంది. ఇప్పటికే కేటీఆర్ నాయకత్వం మీద కాంగ్రెస్ నేతలతో పాటుగా చెల్లి, టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కూడా పలు విమర్శలు సాగించారు.
అందుకు తగ్గట్టే కేటీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్న బిఆర్ఎస్ ఇప్పటి వరకు కేటీఆర్ ని రాజకీయంగా మరింత బలపరిచేలా, పార్టీ శ్రేణులకు కేటీఆర్ నాయకత్వం మీద ఒక భరోసా కల్పించేలా ఒక్క గెలుపు కూడా పొందలేకపోయింది. ఇటువంటి పరిస్థితులలో నేడు కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సభ ఏ మేరకు విజయవంతం అవుతుంది అనేది తెలంగాణ రాజకీయాలలో, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఆసక్తిగా మారింది.
కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు, బిఆర్ఎస్ ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పార్టీ భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ పాదయాత్రకు కూడా సిద్దమయినట్టు తాజాగా ప్రకటించారు.
కేటీఆర్ పాదయాత్ర లోకేష్ యువగళం మాదిరి పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తుందా.? కేటీఆర్ నాయకత్వాన్నీ నమ్మి బిఆర్ఎస్ క్యాడర్ పార్టీకి అండగా నిలుస్తారా అన్నది రానున్న రోజులలో తేలనుంది. అయితే ప్రస్తుతానికి ప్రత్యర్థి పార్టీల నేతలకు భయం కలిగేలా, సొంత పార్టీ శ్రేణులకు నమ్మకం ఏర్పడేలా కేటీఆర్ తన నాయకత్వాన్ని నిరూపించుకోవాలి.
అయితే రేపు హైద్రాబాద్ లోని సరూర్ నగర్ లో జరగబోయే యువ సంగ్రామ సభ కార్యక్రమంతో కేటర్ ఆ అగ్నిపరీక్ష కు సిద్దమవుతారా.? పార్టీ శ్రేణులను తన వైపు ఆకర్షించుకోగలుగుతారా.?




