కేటీఆర్ నీతులు…ఇప్పటికైనా.? ఎప్పటికైనానా.?

KTR’s Stand on Defections: Politics of Power or Principles?

ప్రతిపక్షంలోకి వస్తే తప్ప ఆ నొప్పి తెలియదా.? ఓటమి ఎదురుపడితే కానీ దాని విలువ అర్థం కాలేదా.? అన్నట్టుగా బిఆర్ఎస్ అధినేతల వ్యవహార శైలి కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పదేళ్ల పాటు బిఆర్ఎస్ పార్టీనే రాజ్యమేలింది.

అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే తెలంగాణలో ప్రతిపక్షమన్నదే లేదా.? అసలు తెలంగాణ ప్రతిపక్ష నేత ఎవరు.? నిన్న కాంగ్రెస్ లో గెలిచిన నేత ఇవాళ గులాబీ జెండా పట్టుకున్నాడేంటి.? తెలంగాణలో ప్రజా తీర్పుకి గౌరవం ఉందా.? ఇలా అనేక ప్రశ్నలు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వినిపించాయి, కనిపించాయి.

ADVERTISEMENT

అయితే నాడు తెలంగాణలో ఏకఛత్రాదిపత్యం వహించి, నయానో భయానో ప్రత్యర్థి పార్టీల నేతలను గులాబీ కారెక్కించిన కేసీఆర్, కేటీఆర్ నేడు తమ పార్టీల నేతలు పార్టీ ఫిరాయించారు, అది చట్ట విరుద్ధం , అప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే ఇప్పుడు అప్రజాస్వామ్యం అంటూ నినదిస్తున్న కేటీఆర్ నాడు ఇవే ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వాటిని ప్రజాస్వామ్య బద్దం చేసేసారు. అలాగే నేడు ఇలా ప్రజా తీర్పుని కించపరుస్తూ పార్టీలు మారడం సిగ్గనిపించడం లేదా అంటూ తన ఆపార్టీ నేతలను ప్రశ్నిస్తున్న కేటీఆర్ నాటి తన పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు క్షమాపణలు చెప్పగలరా.?

కేటీఆర్ చెపుతున్న ఈ రాజకీయ నీతులు కేవలం ఇప్పటికి మాత్రమేనా.? లేక ఎప్పటికైనా ఇవి ఇలానే ఉంటాయా.? అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ చేసిన రాజకీయ నీతులు ప్రవచనాలను తలపించేలా ఉన్నాయి.

తమ పార్టీ జెండా తో గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, కోర్ట్ మొట్టికాయిలతో నేను పార్టీ మారలేదు అంటూ ప్లేట్ ఫిరాయించిన నేత పేరు ఇప్పుడుకాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయిర్ జాబితాలో ఉండడం ఏంటి.? ఇదేనా కాంగ్రెస్ రాజకీయం.?

కనీసం ఏ పార్టీలో ఉన్నమో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా.? అటువంటి వారికి ప్రజలను ఓటు అడిగే హక్కు ఉంటుందా.? అంటూ కేటీఆర్ బిఆర్ఎస్ ఫిరాయింపు నేతల మీద కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మీద మండిపడ్డారు.

అయితే గతంలో పక్క పార్టీలో గెలిచిన నేతను తీసుకెళ్ళి మీ ప్రభుత్వంలో మంత్రి ని చెయ్యలేదా.? ఆయా నేతలను మీ పార్టీలో ముఖ్యనాయకులుగా తీర్చిదిద్దలేదా.? అంటూ కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి మొదలవుతుంది. అయితే పార్టీ ఫిరాయింపుల మీద కేటీఆర్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు చూస్తుంటే “అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి ప్రతిపక్షంలోకి వచ్చాకా విలువలు మాట్లాడొచ్చా” అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories