తెలంగాణ ఎన్నికల ఫలితాల విషయంలో ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే అంచనాలు తప్పాయి. పోలింగ్ పూర్తయ్యాక ఆయన తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విడుదల చేసిన సర్వే పెను సంచలనం సృష్టించింది. ఈ సర్వేలో జననాడి ప్రజాకూటమికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత అంతర్గతంగా ఉందన్న విషయం తాము జరిపిన సర్వేలో తేలిందని ఆయన వెల్లడించారు. కేటీఆర్ ఆయన వాదనతో విబేధించినా ఆయన వాటికే కట్టుబడి ఉన్నారు.
[m9ad]
తాజాగా వెలువడిన ఫలితాలతో కేటీఆర్ అంచనాలే వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని తేలింది. గతం కంటే అధిక స్థానాల్లో అధికార తెరాస ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమి ఇరవై సీట్లకే పరిమితం కాబోతుంది. బీజేపీ బలపడుతుంది, ఇండిపెండెంట్లు బాగా ప్రభావం చూపిస్తారని ఆయన చెప్పినది కూడా జరగలేదు. ఈ క్రమంలో ఆయనపై విరుచుకుపడుతున్నారు మహాకూటమి పార్టీ నేతలు, అభిమానులు. తెలుగు దేశం అభిమానులకు మాత్రం లగడపాటిపై ఇంకో అనుమానం కూడా ఉంది.
గత కొద్ది కాలంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వెయ్యడానికి లగడపాటి సర్వేల మీదే ఆధారపడుతున్నారు. చివరి నిముషం దాకా పట్టించుకోని తెలంగాణను కాంగ్రెస్ తో కలిసి మరి హోరా హోరీగా పోరాడటం వెనుక కూడా లగడపాటే కారణమట. ఆయన ఇచ్చిన తెలంగాణ సర్వేను నమ్మే చంద్రబాబు తెలంగాణను సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. ఇప్పుడు ఆయన ఇచ్చిన సర్వేలు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఫాలో అయితే మొదటికే మోసం రావచ్చు అని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు.
అయితే గతంలో నంధ్యాల విషయంలో లగడపాటి సర్వే బానే పని చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాల విషయంలో లగడపాటి అంచనాలు తప్పడం ఇదే మొదటి సారి. అయితే చాలా కీలకమైన తరుణంలో ఆయన గురి తప్పింది. ఇన్ని సంవత్సరాల పాటు ఆయన సంపాదించుకున్న పేరు ఒక్కసారిగా నష్టపోయినట్టు అయ్యింది. ఈ తరుణంలో లగడపాటి మీడియా ముందుకు వస్తారో లేదో చూడాలి. ఇది వరకు తెలంగాణతో పెట్టుకుని రాజకీయ సన్యాసం చేశారు ఇప్పుడు సర్వేల సన్యాసం ఖాయం అని కేటీఆర్ రెండు రోజుల క్రితం అన్నారు. అదే జరగబోతుందా?



