“లక్ష్మీస్ ఎన్టీఆర్” అన్న నామకరణం చేసి… ఎన్టీఆర్ జీవితచరిత్రను వైసీపీ నేత లక్ష్మీ పార్వతి కోణం నుండి రాంగోపాల్ వర్మ చూపించబోతున్నారని ఇప్పటికే టిడిపి వర్గాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీటికి మరింత బలం చేకూరే విధంగా లక్ష్మీ పార్వతి చేస్తోన్న వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. ఇప్పటివరకు మీడియా ముఖంగా చెప్పని పలు విషయాలను లక్ష్మీ పార్వతి తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించడం విశేషం.
మొదటి పెళ్లి గురించి బహిరంగంగా ప్రస్తావించని లక్ష్మీ పార్వతి, తాజాగా దాని గురించి మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. తన ఇష్టం గానీ, తన తల్లితండ్రుల ఇష్టం గానీ లేకుండానే తన మొదటి పెళ్లి జరిగిందని, మాకు ఒక కొడుకు పుట్టిన తర్వాత విభేదాల కారణంగా విడిపోయామని, ఆ తర్వాత తాను ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయానని నాటి విషయాలను ప్రస్తావించారు.
ఇక తనకు – ఎన్టీఆర్ కు పెళ్లి జరగకుండా ఆపాలని చాలామంది ప్రయత్నించారని, కానీ ఎన్టీఆర్ చాలా గట్టిగా ప్రయత్నించడం వలనే తమ పెళ్లి జరిగిందని, ఈ తరుణంలోనే తమది రెండవ పెళ్లి కావడంతో ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు, పార్టీ కూడా ఓడిపోతుందని పుకార్లు పుట్టించారని, దీనంతటికి కారణం తమ చిన్నల్లుడు చంద్రబాబు నాయుడేనని, తన అభిమతాన్ని మరోసారి వ్యక్తపరిచారు.
అయితే ఉన్నట్లుండి ఈ విషయాలను ప్రస్తావించడం వెనుక పక్కా వ్యూహం ఉందని, త్వరలో తెరకెక్కనున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనేది ఇలాంటి విషయాల సమాహారమేనని పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వర్మ సినిమాలో చూపించే కంటే ముందు వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సదరు అంశాలను ప్రస్తావించి, సినిమా వచ్చే నాటికి ప్రజలను మానసికంగా సిద్ధం చేసే రీతిగా మాట్లాడుతున్నట్లు కనపడుతోంది.


