పెద్ద నోట్ల రద్దుతో ప్రజల ముందుకొచ్చిన 2000 రూపాయల నోటు “ఫస్ట్ లుక్”పై అందరూ పెదవి విరిచిన విషయం తెలిసిందే. ఈ నోటు చూడడానికి మరీ కామెడీగా ఉందంటూ సర్వత్రా ఎన్ని విమర్శలు వ్యక్తమైనా… చాలా సెక్యూరిటీతో దీనిని రూపొందించామని, దీనికి ఫేక్ నోటులను సృష్టించడం అసాధ్యమని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చుకుంది. అయితే 2000 రూపాయల నోటుపై వచ్చిన విమర్శలు 500 నోటుపై వ్యక్తం కాకపోవడం గమనించదగ్గ విషయం.
ఇదిలా ఉంటే… ఇక నుండి 1000 రూపాయల నోటును ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెప్పగా, ఆ తర్వాత ఆర్బీఐ అధికారులు మాత్రం, ప్రస్తుతం ఉన్న చిల్లర కొరతను నిర్మూలించాలంటే ఖచ్చితంగా 1000 రూపాయల నోటును ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన చేసినట్లుగా గత రెండు రోజులుగా మీడియా వర్గాలలో వస్తున్న కధనాలు తెలిసినవే. అయితే ఇంతకీ ఏది నిజమో, ఏది అబద్ధమో గానీ, సోషల్ మీడియాలో ఉన్నట్లుండి కొత్త 1000 రూపాయల నోటు ప్రత్యక్షమైంది.
చూడడానికి మరింత కామెడీగా ఉన్న నోటు నిజమో, కాదో గానీ సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. బ్లూ కలర్ షేడింగ్ తో ఉన్న ఈ నోటు లుక్ పై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు. అయితే ఆర్బీఐ ప్రవేశపెట్టే నోటు కంటే కూడా కొందరు ఆకతాయిలు చేసిన ఫోటోషాప్ పనిగా విశ్లేషిస్తున్నారు. ఇండియాలో కరెన్సీ అంటే ‘పచ్చ’ రంగుకు అలవాటు పడిపోయిన ప్రజానీకానికి, మోడీ సర్కార్ అన్ని రంగులను చూపిస్తోంది కదా!



