
2019 ఎన్నికలలో ఒక ముఖ్యమంత్రి కుమారుడిని, టీడీపీ పార్టీ భవిష్యత్ నాయకుడిని ఓడించాను అనే విజయ గర్వం తో మంగళగిరిలో అడుగుపెట్టిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి అక్కడ ప్రజలకు చేసిందేమిటి.? అలాగే అతని చర్యలతో వైసీపీ పార్టీకి ఒరిగిందేమిటి.? అన్న విషయాలు ఒక్కసారి చర్చించుకుందాం.
Also Read – సిఎం చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని విజ్ఞప్తి
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయాడు అనే వార్త తప్ప వైసీపీ పార్టీకి గొప్పగా జబ్బలు చరుచుకుంటూ చెప్పుకునే మరో సంచలనం అంటూ ఏమి లేదంటే అది అతి సయోక్తి కాదనే చెప్పాలేమో. ఇక లోకేష్ పై ఆర్కే విజయం సాధిస్తే మీ ఎమ్మెల్యే కు మంత్రి పదవి ఖాయం అంటూ జగన్ ఈ ప్రాంత ప్రజలకు హామీ కూడా ఇచ్చారు.
దీనితో మంగళగిరిలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉండబోతుందో అన్న ఆలోచన ప్రతి ఒకరిలో కనిపించింది. అయితే అంచనాలు ఈ స్థాయిలో ఉంటే అసలు వాస్తవాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మంగళగిరిలో ఉండవల్లి ప్రాంతంలో ‘ప్రజా వేదిక’ కూల్చివేతలో వైసీపీ తన విధ్వంసానికి మొదటి పునాది రాయి వేసింది.
ఈ కూల్చివేతను స్థానిక ఎమ్మెల్యే గా ఉన్న ఆర్కే దగ్గరుండి పూర్తి చేసారు. అలాగే రాజధాని అమరావతి వినాశానికి కూడా ఇక్కడి నుండే వైసీపీ వ్యూహాలకు శంకుస్థాపన చేసారు ఆర్కే. పేదల ఇళ్లకు ప్రభుత్వ పట్టాలు ఇస్తాను అంటూ ఎన్నికలప్పుడు హామీలిచ్చిన ఆర్కే అధికారంలోకి రాగానే అదే పేదల ఇళ్లను బలవంతంగా, బెదించి, భయపెట్టి అత్యంత కర్కోటకంగా ఖాళీ చేపించి వారి కన్నీటి ఉసురు కి కారణమయ్యారు.
అలాగే రాజధాని అమరావతిని సమాధి చేయడానికి జగన్ కు తనవంతు సహకారం అందించారు ఆళ్ల. అలాగే మంగళగిరి అంటేనే ఇక్కడి చేనేత పరిశ్రమ అందరికి గుర్తొస్తుంది. అటువంటి కళా నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో కుటుంబాలు ఇక్కడ జీవనోపాధిని పొందుతున్నాయి. అటువంటి వారి సమస్యలను కూడా పట్టించుకోకుండా అధికారం ఉన్న ఐదేళ్లు జగన్ కు ఊడిగం చేసి ఇక్కడి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు ఆళ్ల. దాని ఫలితమే 2024 లో కనీసం ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయారు.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
అయితే గత ఐదేళ్ల ఆర్కే వినాశనం, వైసీపీ విధ్వంశం కళ్ళ చూసిన స్థానిక ప్రజలు 2024 లో 90 వేలకు పైగా మెజారిటీ తో లోకేష్ కు పట్టం కట్టారు. అయితే నాటి నుంచి నేటి వరకు 10 నెలల వ్యవధిలో తనకు ఇంతటి మెజారిటీ ఇచ్చిన ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం లోకేష్ ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళగిరి ఎమ్మెల్యే గా విద్యా, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న లోకేష్ ఇక్కడి ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ‘స్వచ్ఛ మంగళగిరి’ పేరుతో సొంత నిధులతో పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తున్నారు.
అలాగే మంగళగిరి లోని ఎకో పార్క్ లో వాకర్స్ ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికి సొంత నిధులతో ముందుకొచ్చారు. ఇక ఎన్నో ఏళ్ళ నాటి పేదల సొంత ఇళ్ల పట్టాల కలను ‘మన ఇల్లు మన లోకేష్’ అంటూ ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చుతూ వారికి ప్రభుత్వం తరపున అధికారిక పట్టాలను అందిస్తున్నారు.
ఇక మంగళగిరి బ్రాండ్ గా చెప్పుకునే చేనేత పరిశ్రమ కు తగిన చేయూత నందిస్తున్నారు. ఇటు స్థానిక ఎమ్మెల్యే గా తన నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చుకుంటూనే మిత్ర పక్ష పార్టీల నాయకులను కూడా కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. మీకు నాకు ఒక్క వాట్స్ అప్ మెసేజ్ దూరం మాత్రమే అంటున్న లోకేష్ రాజకీయం ముందు వైసీపీ చిన్నబోతుంది.
మంగళగిరి అభివృద్ధి పట్ల లోకేష్ దూకుడు చూసినా, ఇక్కడి ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిబద్దత గమనించినా ఇక మంగళగిరి పై వైసీపీ పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తుంది. ఈ అభిప్రాయాన్నే బలపరుస్తూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య కానీ, మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కానీ రాజకీయంగా తమ ఉనికిని కోల్పోయారు.