మాంత్రికుడు మంత్ర దండం తిప్పి గాల్లోంచి పావురాలు సృష్టించిన్నట్లు, జగన్ కోసం విజయసాయి రెడ్డి కూడా అనేక సూట్ కేసు కంపెనీలు సృష్టించి ఇచ్చారు. ఆ ఆక్రమస్థుల కేసులలో ఏ-2గా జగన్ వెంట చంచల్ గూడా జైలుకి కూడా వెళ్ళి వచ్చిన విజయసాయి రెడ్డి, మళ్ళీ ఏ-1 కోసం మరో కొత్త సమస్యలో చిక్కుకోవడమే విచిత్రం.
కాకినాడ సీపోర్ట్ వాటాల వ్యవహారంలో విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డి ముగ్గురిపై ఏపీ సీఐడీ ‘లుక్ అవుట్’ నోటీస్ జారీ చేసింది.
Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్?
ఆ కేసులో కాకినాడ సీపోర్ట్ ప్రధాన భాగస్వామి కర్నాటి వేంకటేశ్వర రావుని బెదిరించి రూ.3,600 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా అరబిందో కంపెనీ పేర బదలాయించుకున్నారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి, ఈ ముగ్గురిపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. నిందితులుగా ఉన్న ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ‘లుక్ అవుట్ నోటీస్’ జారీ చేసిన్నట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం విలువ వంద కోట్లు. ఆ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితలతో సహా పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ పోర్టు వాటాలు విలువ ఏకంగా రూ.3,600 కోట్లు. ఆ లెక్కన ఇది మరింత తీవ్రమైన ఆర్ధిక నేరమే అవుతుంది.
Also Read – అక్కడ కవిత.. ఇక్కడ గుడివాడ సేమ్ టూ సేమ్!
ఒకవేళ కూటమి ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఈ కేసుని నిర్భయంగా విచారణ జరిపించగలిగితే, పౌరసరఫరా శాఖ, పోర్టు, పోలీస్ తదితర శాఖలలో పాత్రధారులతో పాటు దీని సూత్రధారులు కూడా దొరుకుతారు.
కానీ ఈ కేసులు, అరెస్టులకు నెగెటివ్ కోణం మాత్రమే కాదు.. సానుభూతి అనే పాజిటివ్ కోణం కూడా ఉంటుంది. కనుక కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయక తప్పదు. ఆ బలహీనతే వైసీపీకి శ్రీరామ రక్షగా నిలుస్తుంది.
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
కనుక తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలా ఈ కేసు కూడా రాజకీయ వేడికి కరిగిపోతుందో లేదా చలికి గడ్డ కట్టుకుపోతుందో తెలీదు. కానీ ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్.