జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలలో జరుగుతున్న జనసేన ఆత్మీయ సమావేశాలకు హాజరు అవుతూ… అభిమానులలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ లోక్‌సభ స్థానాలు జనసేన పార్టీకి ఖాయమైపోయాని, మిగిలిన లోక్ సభ స్థానాల్లో మన పార్టీ గట్టిపోటీ ఇస్తుందని ఆయన జోస్యం చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు మొదలైందని.. సార్వత్రిక ఎన్నికల్లో యువత, మహిళలు, వృద్ధులు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారని ఆయన తెలిపారు. మరికొద్ది రోజుల్లో అనూహ్య ఫలితాలు వెలువడనున్నాయన్నారు. “రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్ వాది పార్టీకి 25 ఏళ్లు పడితే.. జనసేన మాత్రం ఐదేళ్లలో రాజ్యాధికారం చేపట్టబోతుంది,” అని ఆయన అన్నారు. అయితే ఆ పార్టీ నేతల అభిప్రాయానికి, ఆలోచనలకు వ్యతిరేకంగానే అన్ని సర్వేలు ఉండటం విశేషం.
పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో గెలుస్తారా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. జనసేన రెండంకెల సీట్లు సాధిస్తే ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చినట్టే. అలా జరగని పక్షంలో మాత్రం ఆ పార్టీ మనుగడే కష్టం. పవన్ కళ్యాణ్ తన రెండు సీట్లలో గెలవకపోతే ఆయనపై తిరిగి సినిమాలు చెయ్యాలనే ఒత్తిడి కూడా పెరుగుతుంది. పార్టీ నాయకులు చెప్పే మాటలు ఎలా ఉన్నా జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఈ నెల 23 వరకు వేచి చూడాలి.



