వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్రలో నీటి సమస్య అనేదే లేకుండా కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమ తన లక్ష్యమని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. ‘సత్యమేవ జయతే వాటర్ కప్ అవార్డ్స్ 2016’ కార్యక్రమంలో భార్య కిరణ్ రావు, ‘సత్యమేవ జయతే టీం’తో కలిసి పాల్గొన్న అమీర్ మాట్లాడుతూ… వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్ర నుంచి కరవును తరమికొట్టడమే తన లక్ష్యంగా పనిచేస్తున్నట్టు, నీటి సమస్యపై పోరాడే మంచి ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి దొరికారు. ఆయన రాజకీయ సంకల్పం చాలా దృఢంగా ఉందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మాట్లాడుతూ… అమీర్ ఖాన్ రీల్ హీరో కాదని, రియల్ లైఫ్ లోనూ హీరోనేనని ప్రశంసలు కురిపించారు. కరవును తరిమికొట్టడంలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. అమీర్ ఖాన్ సత్యమేవ జయతే టీవీ టీం ‘పానీ ఫౌండేషన్’ను స్థాపించి ‘వాటర్ హార్వెస్టింగ్’పై ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ గ్రామాలు చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించి ‘సత్యమేవ జయతే వాటర్ కప్ 2016’ అవార్డులు అందిస్తుంది.
‘వాటర్ హార్వెస్టింగ్’పై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏప్రిల్ 20 నుంచి జూన్ 5 వరకు ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం నాడు విజేత గ్రామాలకు బహుమతులు అందించారు. కోరేగాం తహశీల్‌లోని వేలు గ్రామం మొదటి బహుమతిగా 50 లక్షలు అందుకోగా, రెండో బహుమతి కింద 30 లక్షలను ఖపర్టోన్, జైగాం గ్రామాలు సంయుక్తంగా అందుకున్నాయి. అంబెజిగై తహశీల్‌లోని రాడి తండా, వరుద్ తహశీల్‌లోని వతోడాలు మూడో బహుమతిగా 20 లక్షలను సంయుక్తంగా అందుకున్నాయి.
మొదటి విడత పోటీల్లో భాగంగా మూడు జిల్లాలను భాగస్వామ్యం చేయగా మలి విడతలో 30 జిల్లాలను భాగస్వామ్యం చేయనున్నట్టు అమీర్ ఖాన్ తెలిపారు. ఒక టాప్ హీరోగానే కాకుండా సామాజిక లక్ష్యం కోసం పాటు పడుతున్న అమీర్ ఖాన్ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియా ప్రశంసలు కురిపిస్తుండగా, సోషల్ మీడియాలో కూడా అమీర్ పై అభిమానం ఓ రేంజ్ లో కురుస్తోంది.



