నేడు విడుదలైన టీడీపీ – జనసేనల మొదటి జాబితా కొంతమందికి ఆనందాన్ని మరికొంతమందికి ఆవేదనను మిగిల్చింది. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పి.గన్నవరం సీటు దక్కించుకున్న టీడీపీ నేత మహాసేన రాజేష్.
బడుగు బలహీన వర్గాలకు సంబందించిన సమస్యల పై నిత్యం ప్రభుత్వం తో పోరాటాలు చేస్తూ వారికి జరుగుతున్న అన్యాయాల మీద ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిలో రాజకీయ అవగాహన పెంచుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు రాజేష్.
ముఖ్యంగా దళితులలో రాజకీయ చైతన్యం కల్పించడానికి 2017 లో మహాసేన అంటూ ముందుకొచ్చిన ఒక సామాన్య దళిత కుటుంబానికి చెందిన సరిపల్లె రాజేష్ 2024 ఏపీ లో జరగబోయే ఎన్నికలలో టీడీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం దక్కించుకోవడం నిజంగా హర్షించదగ్గ పరిణామమనే చెప్పాలి.
ఇటువంటి సాధారణ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, నాయకులుగా తయారుచేయడంలో టీడీపీ పార్టీ ఎప్పుడు ముందువరుసలోనే ఉంటుందని బాబు మరోసారి నిరూపించుకున్నారు. గత 2019 ఎన్నికలలో ఇదే మహాసేన రాజేష్ వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసి జగన్ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వరుసగా దళితుల మీద జరుగుతున్న దాడులను, అన్యాయాలను చూసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం మొదలుపెట్టారు. ఇక దీనితో అధికార పార్టీ మహాసేన మీద కేసులతో దాడి చేసి రాజేష్ గొంతు నొక్కే ప్రయత్నం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన మహేసనకు అండగా ఉంటూ తమ మద్దతు తెలియచేశాయి. అయితే బాబు స్వయంగా రాజేష్ ను పిలిచి తనపై ప్రభుత్వం చేస్తున్న దాడిని ఖండించి పార్టీ తరుపున భరోసా కల్పించడంతో టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు రాజేష్.
అలా ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీ పార్టీ తరుపున పని మొదలుపెట్టిన కొద్దికాలంలోనే బాబు ఎమ్మెల్యే సీటు ప్రకటించడంతో రాజేష్ ‘మహాసేనకు మహా అవకాశం’ దక్కినట్లైంది. దీనితో రాజేష్ భావోద్వేగానికి గురయ్యారు. ఎటువంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ కానీ, వేల కోట్ల ఆస్తులు కానీ, సీటు కోసం ఎటువంటి లాబీయింగ్ కానీ చేయకుండా చంద్రబాబు పిలిచి మరి సీటు ఇవ్వడంతో రాజేష్ మహాసేన పేరు ఈ జాబితాలో హాట్ టాపిక్ అనే చెప్పాలి.
పార్టీ కోసం చిత్తశుద్దిగా పనిచేస్తే అవకాశాలు వెతుకుంటూ వస్తాయని, తనను నమ్మి బాబు ఇచ్చిన ఈ అవకాశాన్ని తన సామజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి వినియోగిస్తానంటూ ఈ ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సహంతో తను, తన సేన ముందుకెళ్తుంది అంటూ బాబు కి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియచేసారు మహాసేన రాజేష్.




