మహాసేన రాజేష్ పరిచయం అక్కరలేని పేరే అయినప్పటికీ ఈయన గారు ఎప్పుడు ఏ పార్టీ తరుపున తన గళం వినిపిస్తారో, ఎప్పుడు ఏ పార్టీ నుండి’ U ‘టర్న్ తీసుకుని బయటకు వస్తారో అనే విషయం గురించి చెప్పడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి.
2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని జగన్ గెలుపు కోసం తనవంతు ప్రచారం చేసి వైసీపీ విజయం లో ‘మహాసేన’ కూడా భాగమే అంటూ జబ్బలు చరుచుకున్నారు రాజేష్. అయితే ఆయనకు ఆ అనందం ఎంతో కాలం నిలవలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితుల మీద జరుగుతున్న దాడులను, క్రైస్తవ చర్చ్ ల ఆస్తుల దోపిడుల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన రాజేష్ వైసీపీ పార్టీ నుండి U టర్న్ తీసుకుని యూ ట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ కి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టిన రాజేష్ కొన్నాళ్ళు జనసేనకు అనుకూలంగా, మరికొన్నాళ్లు టీడీపీ కి మద్దతుగా వీడియోలు చేస్తూ అటు జనసేన, పవన్ అభిమానులతో పాటు ఇటు టీడీపీ మద్దతుదారులకు దగ్గరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన ప్రచారానికి గాను వైసీపీ ప్రభుత్వం రాజేష్ పై అనేక కేసులు మోపి జైలుకు పంపారు. ఇటువంటి కిష్ట సమయంలో మహాసేనకు, రాజేష్ కు తమ మద్దతు తెలియ చేసారు జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత బాబు.
ఇరు పార్టీల అధినేతల మద్దతు దక్కడంతో ఇక ఇవాళో రేపో టీడీపీ కానీ జనసేన కండువా కాని కప్పుకోవడం ఖాయం అనుకున్న సందర్భంలో పసుపు కండువా కప్పుకుని టీడీపీ సైకిల్ ఎక్కారు మహాజన రాజేష్. అలాగే ఈ ఎన్నికలలో పి. గన్నవరం నుండి టీడీపీ టికెట్ కూడా దక్కించుకున్న రాజేష్ దానిని నిలబెట్టుకోవడంలో తప్పటడుగులు వేసి ఆ సీటుని జనసేనకు దక్కేలా చేసుకున్నారు.
అయితే గతంలో వైసీపీ కి మద్దతు పలికిన రాజేష్ ఆ సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా చేసిన పలు వ్యాఖ్యలు అలాగే పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైసీపీ విపరీతంగా సర్క్యులేట్ చేసిందంటూ మనసు మార్చుకుని స్వయంగా ఎన్నికల పోటీ నుండి తప్పుకుంటున్న అంటూ ప్రకటించి రాజేష్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. ఇక చేసేదేమి లేక ఆ సీటుని టీడీపీ జనసేనకు కేటాయించింది.
దీనితో కలత చెందిన రాజేష్ మరోసారి U టర్న్ తీసుకుని కూటమికి వ్యతిరేకంగా పని చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ కొన్ని రోజులకు మరో U టర్న్ తీసుకున్న రాజేష్ మళ్ళీ మనసు మార్చుకుని టీడీపీ కి అండగా ఉంటానంటూ ప్రకటించారు. అలాగే టీడీపీ కూడా టీడీపీ ఎన్నికల స్టార్ కాంపైనర్ గా రాజేష్ పేరును ఖరారు చేసింది. దీనితో రాజేష్ మళ్ళీ గాడిన పడ్డారు అనుకునే లోపే మరోసారి మనసు మార్చుకుని మళ్ళీ మరో U టర్న్ బాట పట్టారు రాజేష్.
అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో జనసేన నేతలు తనను అవమానించారంటూ మరోసారి అలక పూనిన మహాజన రాజేష్ పవన్ ఓటమికి పని చేస్తానంటూ ఆవేశంగా ప్రసంగిస్తున్నారు. పవన్ గెలుపు ఈ రాష్ట్రానికి ప్రమాదకరం, పవన్ కన్నా జగన్ మేలు అంటూ మళ్ళీ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఎన్నికలకు వారం రోజుల ముందు ఇలా మహాసేన రాజేష్ వైసీపీ వైపు U టర్న్ తీసుకోవడం వెనుక ఉన్న ఆ ఆంతర్యం ఏమిటో..?
ఒక పక్క రాష్ట్రమంతా కూటమి గాలి వీస్తున్న ఇటువంటి సందర్భంలో మహాసేన చేస్తున్న ఈ దుష్ప్రచారం కూటమి నేతల గెలుపుని ప్రభావితం చేయగలదా..? ఈ కీలక సమయంలో టీడీపీ కండువా కప్పుకుని జనసేన పైన పవన్ పైన రాజేష్ ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఓటు బదిలీని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. బాబు వెంటనే రాజేష్ ను కట్టడి చేయకపోతే బ్లూ మీడియాకు మంచి విందు భోజనం దొరికినట్టే అవుతుంది.
తానూ సీటుని కోల్పోవడానికి కారణమైన వీడియో లను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది వైసీపీ, అయినా అదే వైసీపీ పై సానుకూలంగా వ్యహరిస్తూ పవన్ పై విమర్శలు చేయడంతో ఈయన ‘మహాసేన రాజేష్’ కాదు ‘U టర్న్ సేన’ అంటూ జనసైనికులు రాజేష్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. కూటమి పార్టీలు దీనిని టీ కప్పులో తుఫాన్ మాదిరే ముగించకపోతే ఆ అవకాశాన్ని వినియోగించుకుని వైసీపీ మరిన్ని వ్యూహాలకు పదునుపెట్టే అవకాశం లేకపోలేదు.




