జీఎస్టీ కట్టనందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్లను జీఎస్టీ కమిషనరేట్ నిన్న సీజ్ చేసింది. హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు మహేష్ బాబుకు సంబంధించిన యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్టు ప్రకటించారు. 2007 – 08 సంవత్సరంలో మహేష్ బాబు నటించిన యాడ్స్‌కు, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు వచ్చిన డబ్బుల్లో సర్వీస్ ట్యాక్స్‌ను చెల్లించలేదు. మొత్తం రూ.18.5లక్షల పన్ను చెల్లించాల్సి ఉంది.
[m9ad]
అయితే, పదేళ్ల నుంచి ఆయన ఆ ట్యాక్స్‌లు కట్టకపోవడంతో అది వడ్డీతో సహా పెరిగింది. అయితే ఇది పన్ను వ్యవహారం ఇప్పటిదాకా మహేష్ బాబుకు తెలియలేదని దీనితో ఈ పరిణామం ఆయనకు షాక్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా తప్పని ఇప్పుడు డిపార్టుమెంటు స్పష్టం చేసింది. పన్ను బకాయిలకు సంబంధించి 2010లో నోటీసు ఇచ్చామని చెప్పారు అధికారాలు. ఆయన స్పందించకపోవడంతో 2012లో ఆర్డర్ పాస్ చేశామన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకున్నా ఆయనకు ఊరట లభించలేదన్నారు.
ట్రైబ్యునల్ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును మహేష్ ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఆర్థిక చట్టం సెక్షన్ 87 ప్రకారం ఆయన బ్యాంకు ఖాతాలను జప్తు చేసినట్టు వివరించారు. దీనిబట్టి ఇదంతా మహేష్ బాబుకు తెలిసే జరిగిందని అనుకోవాలి. మహేష్ బాబు లాంటి కోటీశ్వరుడు 18.5 లక్షల కోసం ఎందుకింత వరకు లాగారో అర్ధం కానీ విషయం. ఇప్పుడు పెనాలిటీ, వడ్డీతో సహా డబ్బు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దానితో పాటు ఎంతో చెడ్డ పేరు కూడా వచ్చింది.
మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు బ్రేక్ తీసుకుని కొత్త సంవత్సర వేడుకల కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళారు. దీనిపై ఆయన అక్కడ నుండే తన ఆడిటర్లతో చర్చిస్తున్నారని సన్నిహితుల సమాచారం. అయితే ఆయన మిగిలిన పన్ను బకాయి చెల్లిస్తారా లేదా దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఒకరకంగా 2018 పోతూ పోతూ మహేష్ బాబుకు ఈ విషయంగా చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్లిందని చెప్పాలి.



