ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొరటాల శివ – మహేష్ బాబుల “భరత్ అనే నేను” సినిమాపై అంచనాలు పెరిగాయన్నది వాస్తవం. అవి కాస్త ఫస్ట్ లుక్ తో తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా… అని ప్రిన్స్ అభిమానులు కాచుకుని కూర్చున్నారు. అయితే ఉన్నట్లుండి ఈ సినిమా పాటకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ నెట్టింట ప్రత్యక్షం అయ్యింది.
సింగర్ కైలేష్ ఖేర్ తో కలిసి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆలపించిన ఓ రెండు పదాల వీడియో నెట్టింట ఓ రేంజ్ లో హంగామా చేసింది. కొరటాల శివ సినిమాలో సహజంగా ఉండే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మాదిరి వినపడుతోన్న ఈ పదాల వీడియో ప్రిన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతో అది కాస్త వైరల్ అయ్యింది. సినిమాలో కనిపించే వీడియో క్లిప్ కాకపోయినా, సిల్వర్ స్క్రీన్ పై వచ్చేవరకు వేచిచూడమని చెప్పడం చిత్ర యూనిట్ వంతవుతోంది.



