ఇటీవల కాలంలో ప్రిన్స్ మహేష్ బాబు ప్రవర్తనలో మార్పు కనపడుతోందా… అంటే ‘ఖచ్చితంగా’ అన్న సమాధానం వెలువడుతోంది. అవును… మునుపెన్నడూ లేనట్లుగా జనాలతో కలిసిపోతూ దర్శనమిస్తున్నాడు ప్రిన్స్. ఒకప్పుడు ఎంతటి దిగ్గజాల వివాహ శుభకార్యాలకైనా ప్రిన్స్ హాజరయితే అది ఓ పెద్ద విషయం. కానీ, ప్రస్తుతం… ‘అసలు ఎంపీ, ఎమ్మెల్యే అంటే కూడా తెలియదని’ చెప్పిన ప్రిన్స్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట వివాహ వేడుకకు హాజరైన పరిస్థితి.
కేవలం ఇదొక్కటే కాదు. రాజకీయ పరమైన ఎలాంటి నిర్ణయాలకైనా ప్రిన్స్ స్పందించింది లేదు. అది పాజిటివ్ అయినా… నెగటివ్ అయినా..! కానీ, పెద్ద నోట్ల రద్దు విషయమై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అవాక్కు చేసాడు. అయితే మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ పరమైన దాని కంటే కూడా, దేశ భవిష్యత్తుని నిర్దేశించే చర్యగా అభివర్ణించడం సమంజసం అవుతుంది. కానీ, ప్రస్తుతం ఈ నిర్ణయంపై కూడా దేశంలో ఓ రేంజ్ లో రాజకీయం జరుగుతున్న వైనం తెలిసిందే.
అలాగే గతంలో ‘చిల్డ్రన్స్ డే’ వంటి కొన్ని ప్రత్యేకమైన రోజుల పట్ల ప్రిన్స్ కు ఆసక్తి ఉండేది కాదు, వాటి గురించి ఎప్పుడూ పేర్కొన్నది లేదు, అసలు ఇలాంటి ‘స్పెషల్ డేస్’ను పట్టించుకోనని ఒకానొక సమయంలో స్పష్టం చేసారు. మరి అలాంటి మహేష్ తాజాగా ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. బహుశా తన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉండడంతో, ఆ అనుభూతే మహేష్ ను ఇలా చెప్పేలా చేసిందో ఏమో గానీ… ప్రిన్స్ లో మార్పు అయితే స్పష్టంగా కనపడుతోందని అభిమానులు చెప్తున్నారు.



