పన్ను విభాగంతో రాజీ చేసుకున్న మహేష్ బాబు

mahesh babu tax controversyనిన్నటి రోజున తాను ప్రభుత్వానికి ఎలాంటి పన్ను బకాయి లేను అని చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మనసు మార్చుకుని డిపార్టుమెంటుతో సెటిల్మెంట్ చేసుకున్నారు. వారు చెప్పినట్టుగా మొత్తం పన్ను బకాయి, పెనాల్టీ, వడ్డీతో సహా 73.5 లక్షల రూపాయలు చెల్లించారు. ఇప్పటికే అటాచ్ చేసిన బ్యాంకులో ఉన్న 42.96 లక్షల రూపాయలను జీఎస్టీ కమిషనరేట్ తీసుకుంది. మిగతా మొత్తాన్ని ఆయన డిపార్టుమెంటు కు చెల్లించారు. 31,47,994 రూపాయలను హైదరాబాద్‌లోని జీఎస్టీ కమిషనరేట్‌కు చెల్లిస్తూ డీడీ పంపించారు.

[m9ad]

ADVERTISEMENT

అసలు ఈ కేసు పూర్వాపరాలలోకి వెళ్తే 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు ప్రభుత్వానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదన్నది పన్ను విభాగం అధికారుల వాదన. ఆ ఏడాది వివిధ ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌ / అప్పియరెన్స్ మనీ / అడ్వర్టైజింగ్ మొదలైన వాటి ద్వారా ఆయన అందించిన సేవలకు లభించిన పారితోషకంపై చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదని వారు తెలిపారు.అప్పట్లో ఆ మొత్తం 18.5 లక్షల రూపాయలు. వడ్డీ, పెనాల్టీల రూపంలో 73.5 లక్షల రూపాయలు అయ్యింది.

పన్ను బకాయిలకు సంబంధించి 2010లో నోటీసు ఇచ్చామని చెప్పారు అధికారాలు. ఆయన స్పందించకపోవడంతో 2012లో ఆర్డర్‌ పాస్‌ చేశామన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకున్నా ఆయనకు ఊరట లభించలేదన్నారు. ట్రైబ్యునల్‌ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును మహేష్‌ ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఆయన ఖాతాలను జప్తు చేశారు.

అయినా సరే ఎందుకో తాము ఎలాంటి సొమ్ము చెల్లించకర్లేదని నిన్న ఆయన ఒక ప్రెస్ నోటు విడుదల చేశారు. అది విడుదల చేసిన 24 గంటల లోపే పూర్తి బకాయి చెల్లించడం విశేషం. మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు బ్రేక్ తీసుకుని కొత్త సంవత్సర వేడుకల కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళారు. ఈ వివాదం మహేష్ కు కొంత చెడ్డ పేరు తెచ్చిందనే చెప్పాలి. ఎలాగైతేనే ఈ కథ సుఖాంతం కావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories