బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈరోజు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై విరుచుకుపడ్డారు. ఐదెకరాలు గల రైతులకు ప్రతిఏటా ఆరువేల రైతు సాయంను అందిస్తామని కేంద్రం బడ్జెట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై మమత విరుచుకుపడ్డారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కాపీకొట్టిందని, వాటి పేర్లునే మార్చి కొత్తగా ప్రకటించారని ఆమె మండిపడ్డారు. కేంద్రం ఇస్తామన్న రైతు సాయం తమకు వద్దని మమత తేల్చిచెప్పారు.
సమఖ్య వ్యవస్థను బీజేపీ నేతలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మమత విమర్శించారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నందునే కేంద్ర ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు. దీనిని ఎన్డీయే ఎన్నికల వ్యూహంగా ఆమె వర్ణించారు. నిజానికి మమత కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇటీవలే వారి రాష్ట్రంలో రైతుబంధును పోలిన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకం తెలంగాణ ప్రభుత్వ పథకం నుండి కాపీ కొట్టారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో బెంగాల్ లో ఆ పథకం ప్రవేశపెడుతున్నాం అని ప్రకటించిన నాడు దీదీ కేసీఆర్ ప్రభుత్వం నుండి స్ఫూర్తి పొందాం అని ఎక్కడా చెప్పలేదు.
బెంగాల్ లో అయితే అది దీదీ మానసపుత్రిక గానే అక్కడి మీడియాతో ప్రచారం చేయించారు. ఇప్పుడు మోడీ చేసింది తప్పు అయితే మమత చేసింది కూడా తప్పే కదా? మోడీకో న్యాయం ఈవిడకో న్యాయమా? కాకపోతే ఫెడరల్ ఫ్రంట్ లోకి తృణమూల్ కాంగ్రెస్ వస్తుంది అనే ఆశతో కేసీఆర్ దీనిని తప్పు పట్టలేదు అంతే. అదే సమయంలో ఇగోకి పోయి కేంద్ర పథకం తమకు వద్దు అని చెప్పడం కూడా తప్పే. అది పెద్ద రైతులకు వచ్చే సొమ్మును ఆపడమే. రైతును అన్ని వైపులా నుండీ ఆదుకోవాల్సిన సమయంలో ఇలా వారికి వచ్చే సొమ్మును రాజకీయ అవసరాల కోసం ఆపడం పాపం.



