నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుండి ప్రారంభమైన కరెన్సీ కష్టాలకు కొత్త సంవత్సరం దాదాపుగా బ్రేక్ వేసింది. గత నెల రోజులుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు జీవనం సాగిస్తుండడంతో, ఇటీవలే ఒక్క సేవింగ్స్ ఖాతాలు మినహా అన్ని ఖాతాలకు నిబంధనలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సడలించింది. అయితే దేశంలో ఎక్కువగా ఉన్నవి, సామాన్య ప్రజలు వినియోగించుకునేవి సేవింగ్స్ ఖాతాలే అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పెద్దగా ఇబ్బందులు తలెత్తనప్పటికీ, ఆర్బీఐ విత్ డ్రాల నిబంధనలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.
అయితే వీటికి శుభంకార్డు పలికే తేదీని ఆర్బీఐ ప్రకటించింది. మార్చి 13వ తేదీతో దేశవ్యాప్తంగా ఉన్న సేవింగ్స్ ఖాతాల నిబంధనలను కూడా పూర్తి ఎత్తివేయనున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఫిబ్రవరి 20వ తేదీ నుండి విత్ డ్రాల పరిమితిని వారానికి 24 వేల నుండి 50 వేల రూపాయలకు పెంచుతున్నట్లుగా, ఆ తర్వాత మార్చి 13తో దీనిని కూడా పూర్తిగా ఎత్తివేసి, అంతకుముందు మాదిరే యధావిధిగా లావాదేవీలు చేసుకునే సౌలభ్యాలను కల్పించనుంది.
అయితే ఇటీవల బడ్జెట్ లో విధించిన నిబంధనలతో ఒకవేళ పెద్ద మొత్తంలో విత్ డ్రాలు చేయాలన్నా కూడా ఖాతాదారులు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మూడు లక్షలకు మించి నగదు లావాదేవీలు చేసిన యెడల 100 శాతం పన్ను విధించే విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో, పెద్ద మొత్తంలో నగదును విత్ డ్రాలను చేసుకొని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలు ఉన్నా, లేకున్నా పెద్దగా వ్యత్యాసం లేదు గనుక, వీటిని మార్చి 13వ తేదీతో పూర్తిగా తిలోదకాలు ఇచ్చేయనుంది ఆర్బీఐ.



