ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల్లో జనసేన పార్టీ, బీఎస్పీ, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దళితుల ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ఆ పార్టీ తో పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ బీస్పీ అధినేత్రి మాయావతి.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ప్రచారం నిర్వహించనున్నారు. మాయావతి, పవన్ ఉమ్మడి మహాసభలను విజయవంతం చేసేందుకు జనసేన, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఏపీలో జనసేన, లెఫ్ట్ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ఈ నెల 2వ తేదీన ఏపీకి రానున్నారు.
మంగళవారం రాత్రికి విశాఖపట్నం చేరుకోనున్న మాయావతి.. 3వ తేదీన ఉదయం వైజాగ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఇక అదే రోజు మధ్యాహ్నం విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. రెండో రోజు పర్యటనలో భాగంగా 4వ తేదీన ఉదయం తిరుపతిలో జరిగే బహిరంగసభలో పాల్గొన్న తర్వాత సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంసభలో పవన్ కల్యాణ్‌తో కలిసి పాల్గొంటారు మాయావతి.
అయితే ఈ వార్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ముచ్చెమటలు పట్టించేదే. దళితులు ఇది వరకు కాంగ్రెస్ కు మద్దతుగా ఉండేవారు. ఆ తరువాత వారు వైఎస్సార్ కాంగ్రెస్ కు మారారు. దళితులలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న మతమార్పిడి కూడా ఈ వర్గాలలో వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతు పెంచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాయావతి ఉమ్మడి ప్రచారం వల్ల ఆ వర్గాల ఓట్లలో చీలిక వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇబ్బందనే చెప్పుకోవాలి. దీనితో ఏంచెయ్యలా అని ఆ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు.



