ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ ఎవరు? అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరుగా ‘నాచురల్ స్టార్’ నాని పేరు మారిపోయింది. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ ను పూర్తి చేసిన నాని, ఈ డిసెంబర్ లో “మిడిల్ క్లాస్ అబ్బాయ్” రూపంలో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కూడా సక్సెస్ బాట పడితే, ఈ ఏడాదిలోనే హ్యాట్రిక్ అందుకునే ఘనత నాని సొంతమవుతుంది.
ఇక దీపావళి శుభాకాంక్షలు చెప్తూ విడుదల చేసిన “ఎంసీఏ” (మిడిల్ క్లాస్ అబ్బాయ్) పోస్టర్ టైటిల్ కు బాగా సింక్ అయ్యే విధంగా రిలీజ్ చేసారు. గళ్ళ లుంగీ కట్టుకుని, పాల ప్యాకెట్లు పట్టుకుని కనపడుతున్న నాని, నిజంగా మిడిల్ క్లాస్ అబ్బాయిలా దర్శనమిస్తున్నాడు. బహుశా మిడిల్ క్లాస్ అబ్బాయిగా మరో హీరో ఇంతకంటే బాగా సూట్ కారేమో అన్న రీతిలో ‘నాచురల్ స్టార్’ తన స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టేస్తున్నాడు.
‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘నేను లోకల్’ సినిమా ద్వారా ఇప్పటికే ఈ ఏడాదిలో సూపర్ హిట్ కొట్టిన నాని – దిల్ రాజు – దేవిశ్రీప్రసాద్ ల కాంబో మరోసారి “మిడిల్ క్లాస్ అబ్బాయ్” ద్వారా పునరావృతం కాబోతోంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని డిసెంబర్ 21వ తేదీన ధియేటర్లలో సందడి చేసేందుకు “ఎంసీఏ” సిద్ధమవుతున్నాడు.


