వర్తమానం నుండి కట్ చేసి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళితే… “దువ్వాడ జగన్నాధం” సినిమా విడుదలైన రోజులలో ‘సినీ రివ్యూ’లపై దర్శకుడు హరీష్ శంకర్, హీరో అల్లు అర్జున్ ల నుండి నిర్మాత దిల్ రాజులతో సహా చేసిన కామెంట్స్ సినీ విజ్ఞులకు విదితమే. అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన రివ్యూలపై కామెంట్స్ ను ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’తోనూ కొనసాగించగా, తాజాగా మరొకసారి “ఎంసీఏ”తో హైలైట్ అయ్యాయి.
సినిమా విడుదలైన ఫస్ట్ డేనే ‘సక్సెస్ సెలబ్రేషన్స్’ అంటూ మొదలుపెట్టిన ‘ఎంసీఏ’ ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… “కొంతమంది విశ్లేషకులు సినిమాను ఎలా చూసినా… ఎంతపెట్టి తీసాం, సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది ముఖ్యం… నాకొచ్చిన సమాచారం ప్రకారం మాకు డబ్బు కట్టిన ప్రతి బయ్యర్ హ్యాపీగా ఉండబోతున్నాడు. రూపాయికి అర్ధ రూపాయి లాభం వచ్చే పరిస్థితి ఉంది” అంటూ ‘సినీ రివ్యూ’లపై తనదైన శైలిలో నొక్కివక్కానించారు.
ఇప్పటివరకు నాని కెరీర్ లో “నేను లోకల్” సినిమా అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రమని, దానిని ఇపుడు “ఎంసీఏ” దాటబోతోందని, అది కూడా ఇదే ఏడాదిలో ఇలా హీరోతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కొట్టడం ఈ 15 సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం అని, ఈ ఏడాదిలో నాని కూడా ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడని, వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానున్న సినిమాతో ‘త్రిబుల్ హ్యాట్రిక్’ అందుకుంటారన్న విశ్వాసాన్ని దిల్ రాజు వ్యక్తపరిచారు.
అంతా బాగానే ఉంది గానీ, ఇలా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే సక్సెస్ సెలబ్రేషన్స్ పెడితే… ప్రేక్షకులకు లేనిపోని డౌట్స్ వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని మాత్రం మరిచినట్లున్నారు. అయితే దానిని మాత్రం నాని తెలివితో బాగా కవర్ చేసాడు. “ఏదైనా లేట్ చేయొచ్చు గానీ, థాంక్స్ మాత్రం వెంటనే చెప్పాలి, అందుకే ఫస్ట్ డేనే సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసాం’ అంటూ తెలివైన సమాధానం ఇచ్చాడు నాని.



