సినీ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ఆ తర్వాత ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఊహించని విధంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిని కూడా అధిరోహించారు. అయితే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ బిక్కచచ్చిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఎంతో ప్రజాభిమానం ఉన్న చిరంజీవి ఆ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగడం లేదు.
పార్టీ సమావేశాలకు గాని, ఎన్నికల ప్రచారాలకు గాని వెళ్లడం లేదు. చివరిసారిగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్లారు. రాజకీయాలకు క్రమంగా దూరమవుతున్న సమయంలోనే సినీ రంగం మళ్లీ అడుగులు వేసి తన 150వ సినిమాను పూర్తి చేశారు. అలాగే పస్తుతం 151 చిత్రం “సైరా నరసింహారెడ్డి” షూటింగ్ కు కూడా రెడీ అవుతున్నారు.
ఇదే సమయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. చిరంజీవి తన రాజకీయ జీవితానికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. ఇకపై తన పూర్తి కాలాన్ని కేవలం సినిమాలకే పరిమితం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం తాను అనుభవిస్తున్న రాజ్యసభ పదవీ సమయం ముగియగానే అధికారికంగా చెప్తారని తెలుస్తోంది. అంటే 2018లో మెగాస్టార్ రాజకీయాలకు టాటా చెబుతారని అంటున్నారు.


