ప్రతి ఐదేండ్లకు ఇదెక్కడి లొల్లి సారూ!

Minister Gangula Kamalakarతెలంగాణ నేతలకు ముఖ్యంగా బిఆర్ఎస్ గా మారిన తెరాస పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలవడంతోనే వీరికి తెలంగాణ వాదం మొదలవుతుంది. గుర్తుకొస్తున్నాయి…గుర్తుకొస్తున్నాయి..అంటూ ప్రతి ఐదేండ్ల కొకసారి వాళ్ళు ఆంద్రోళ్ళు, మేము తెలంగాణ బిడ్డలం మా మీద మీ పెత్తనం ఏంటి? అంటూ గడిచిన దశాబ్దం నుండి ఎన్నికల్లో ఇదే పంచాయతీ నడుస్తాంది.

తాజాగా తెలంగాణాలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో మళ్ళి ఇదే వాదనను తెర మీదకు తెచ్చారు బిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్. ఆంధ్రోళ్లు, కాంగ్రెస్,బీజేపీ కలసి కేసీఆర్ సారుని గద్దె దింపడానికి, తెలంగాణ రాష్ట్రాన్నిఆంధ్రాలో కలపడానికి కుట్ర చేస్తున్నారు అంటూ ఒక అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.కేసీఆర్ తన పార్టీ పేరుని మార్చగలిగారు కానీ ఆపార్టీ నేతల కుంచిత మనస్సుని మార్చలేకపోయారు అని ఆపార్టీ నేతలే రుజువు చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

తెరాస పార్టీ బిఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది తమది జాతీయ పార్టీ అని తమ పార్టీది జాతీయ వాదం అని చెప్పుకునే బిఆర్ఎస్ అధిష్టానం దేశంలో తమకు బలమున్న అన్ని రాష్ట్రాలలో తమ పార్టీ ఎన్నికల బరిలో దిగుతుంది అని చెప్పిన వ్యాఖ్యలు గంగుల వినలేదా? లేక వినిపించుకోవట్లేదా?ఇప్పటికే ఆంధ్రాలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తోటా చంద్రశేఖర్ ను నియమించిన సంగతి గంగుల మరచినారా?

మీకు ఆంధ్రోళ్లు వద్దు అన్నప్పుడు ఆంధ్రాలో మీ పార్టీకి ఏంపని? తెలంగాణోళ్లు పెత్తనం ఆంధ్రాకు అవసరమా? గంగుల దీనికి కూడా బదులిస్తే బాగుండేది. కానీ ఆంధ్రాలో బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కానీ, అధ్యక్షుడిని నియమించినప్పుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ వ్యతిరేకించలేదు. అదిప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అంటూ అందరు స్వాగతించారు కూడా.

ఏ రాష్ట్రములో వారైనా దేశంలో ఎక్కడైనా తన రాజకీయ పార్టీని స్థాపించవచ్చు, ఎన్నికల బరిలో అడుగుపెట్టవచ్చు. అయితే ప్రజల ఆదరణే ఇందులో కీలకాంశం. అంతే కానీ పార్టీ పెట్టడానికి, ఎన్నికలలో పోటీ చేయడానికి మరో రాజకీయ పార్టీ అనుమతి అవసరం లేదనే కనీస అవగాహన కూడా లేకుండా గంగుల మాట్లాడడం దురదృష్టకరం.ఇప్పటికే రాజకీయ విద్వేషాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య నలిగిపోతున్నారు.

ఇక ఇప్పుడు ఈ తెలంగాణ ఎన్నికల పంచాయితీతో ఆంధ్రోళ్ల పెత్తనం అంటు తమ ఆత్మగౌరవంతో ఆటలు ఆడుకోవడం బిఆర్ఎస్ నేతలకు తగదు అంటూ ఏపీ ప్రజలు తమకు అలవాటైపోయిన మౌనరోదనలో ఉన్నారు. విభజన జరిగి దశబ్దం గడుస్తుంది. దశాబ్ద కాలం పాటు తెలంగాణలో “కారే” చక్రం తిప్పుతుంది. ఇప్పుడు కొత్తగా తెలంగాణాలో మరో పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను ఆంధ్రాలో ఎలా కలుపుతారు?

అది సాధ్యమయ్యే పని కాదు అని ఆయా నేతలకు తెలియదా? ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కొలిక్కిరాని పంచాయితీలు చాలానే ఉన్నాయి. అయినా ఎన్నికలలో మీ గెలుపుకి ఆంధ్రోళ్ల ఓట్లు కావాలి కానీ ఎన్నికల బరిలో నిలవడానికి ఆంధ్రోడు పనికిరాడా? ఇప్పటి దాకా తెలంగాణాని ఆంధ్రాలో కలిపేస్తారు అంటున్నారు ఇక రానున్న ఎన్నికలలో దేశం మొత్తాన్ని ఆంధ్రాలో కలిపేస్తారు అంటారేమో మరి గంగుల గారు. రాజకీయ విమర్శలు చేసేప్పుడు కొంత వాస్తవిక ధోరణిలో చేస్తే వాటిని విశ్వసించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారు.

అంతేకాని ఇలా రెండు రాష్ట్రాల ప్రజలు మధ్య విద్వేషాలు సృష్టించి రెండు రాష్ట్రాల అధినేతలు మాత్రం మిత్రులుగా కలిసి ఉంటాం అంటే ఎలా సారూ! ఓట్ల కోసం మళ్ళి రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ఇకనైనా రాజకీయ నాయకులు ముగించకపోతే అటువంటి నేతల రాజకీయ భవిష్యత్ కి ప్రజలే ముగింపు పలికే రోజు తొందరలోనే వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories