ఏపీ విధ్వంసంతో బీజేపీకి సంబంధం లేదా?

Rajnath Singh

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనతోనే చాలా చితికిపోయింది. విభజన సమస్యలను, నష్టాన్ని చంద్రబాబు నాయుడు యధాశక్తిన తగ్గించి రాష్ట్రాన్ని గాడిన పెట్టి జగన్మోహన్‌ రెడ్డికి అప్పగించి దిగిపోయారు. విభజన తర్వాత, ఈ 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితుల గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసు.

ముఖ్యంగా అడగగానే కాదనుకుందా అప్పులు ఇప్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఇంకా బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్‌ దివాళా స్థితికి చేరుకొందని సాక్షాత్ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టారు.

ADVERTISEMENT

ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ చేసిన అమరావతి అభివృద్ధికి వేలకోట్లు ఇచ్చినందున అక్కడ జరిగిన అభివృద్ధి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిచిపోయిందని కూడా తెలుసు. అమరావతిని పాడుబెట్టి మూడు రాజధానుల పేరుతో ఏపీలో జరుగుతున్నా డ్రామాలు, ఆ పేరుతో జరుగుతున్న భూకబ్జాల గురించి కూడా కేంద్రానికి తెలుసు.

దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి కనుక ఏపీలో గుప్పుమంటున్న గంజాయి పొగల గురించి కూడా బాగా తెలుసు.

నేడు విశాఖలో పర్యటించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు భరత్, విష్ణుకుమార్ రాజులతో కలిసి మేధావులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న అరాచక వ్యవస్థలతో సహా ఏపీ నెలకొన్న ఈ పరిస్థితులన్నీ మాకు తెలుసని స్వయంగా చెప్పారు. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్ళలో విధ్వంస పాలన సాగించడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు.

రాష్ట్రంలో ఈ పరిస్థితులను సరిచేసేందుకే తమ పార్టీ టిడిపి, జనసేనలతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తోందని చెప్పారు. మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తమ కళ్లెదుటే భ్రష్టు పట్టిపోతోందని తెలిసి ఉన్నా ఈ 5 ఏళ్ళు ఎందుకు నష్టనివారణ చర్యలు చేపట్టలేదు?

జగన్‌ ప్రభుత్వాన్ని ఎందుకు గాడిన పెట్టలేదు? ఐదేళ్ళు జగన్‌ ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకరిస్తూ రాష్ట్రం నష్టపోతున్నా ప్రేక్షకపాత్రకే పరిమితమైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని నిందించి ఏం ప్రయోజనం? జరిగిన నష్టాన్ని ఈ విమర్శలు పూడ్చలేవు కదా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంటే 25 ఎంపీ సీట్లు మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటం వలననే ఆ 25 సీట్లకు తగ్గట్లు రాజకీయాలు చేయాలనుకొంది తప్ప ఏనాడూ ఏపీని గుజరాత్ రాష్ట్రంలా చూడలేదు. చూడకపోవడం వలననే నేడు ఏపీ ఇంత దయనీయ స్థితికి చేరుకొంది.

కనుక జగన్‌ ప్రభుత్వాన్ని నిందించినంతమాత్రన్న బీజేపీ పాప ప్రక్షాళన అయిపోదు. పాప పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకొనేందుకు సిద్దపడితేనే ఆంద్రా ప్రజలు బీజేపీని ఆదరిస్తారు లేకుంటే మరో కాంగ్రెస్ పార్టీగా మిగిలిపోతుంది అంతే.

ADVERTISEMENT
Latest Stories