వైసీపీ అధినేత జగన్ వైఖరితో ఆ పార్టీ ‘ఫైర్ బ్రాండ్’ రోజా విసిగిపోయారా? వీలైనంత త్వరగా వైసీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా? అంటే అవుననే సమధానమే వినిపిస్తోంది. పలు విషయాలపై రోజాకు జగన్ క్లాస్ పీకారని, పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారనే వార్తలు ఇప్పటికే సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో విశాఖలో జగన్ నిర్వహించిన మహా ధర్నాకు రోజా దూరమయ్యారనే వార్తలు కూడా వినిపించాయి.
పార్టీ అధినేత జగన్ వైఖరి రోజాకు ఏ మాత్రం మింగుడు పడడం లేదని తెలుస్తోంది. పార్టీ మైలేజ్ కోసం తనను ఉపయోగించుకున్న జగన్… ఇప్పుడు అవసరం తీరిపోయాక, తనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. తనకు, జగన్ కు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు పార్టీలోనే కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాల పట్ల విసిగిపోయినట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా, పదే పదే తనను మనస్తాపానికి గురి చేస్తున్నారని రోజా భావిస్తున్నారట.
మీడియా మీట్ లలో అధికార పక్షంపై దుమ్మెత్తి పోయడానికి తనను పిలిచే పార్టీ నేతలు, ఆ తర్వాత తనను కరివేపాకులా తీసివేస్తున్నారని, దీంతో ఇక పార్టీలో కొనసాగడం చాలా ఇబ్బందికరంగా మారిందని రాజకీయ వర్గాలలో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనే సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, వైసీపీ గుడ్ బై చెప్పిన తర్వాత ‘జనసేన’ జెండా పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు మరింత సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తోన్న ‘జనసేన’ వైపుకు రోజా చూపులు ఉన్నాయని, అంతేకాక, ‘జబర్దస్త్’ టీవీ షోలో తన కో-హోస్ట్ అయిన నాగబాబుతో కలసి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ను రోజా కలిసారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. రాయలసీమకు చెందిన రోజా అక్కడి నుంచే జనసేన తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని, పవన్ కూడా ఆమెకు స్వాగతం పలికారని తెలుస్తోంది. ఈ క్రమంలో రోజా పార్టీ మారడం లాంచనమే అన్న టాక్ బలంగా వినపడుతోంది.



