నల్లధనం ఎవరి దగ్గరైనా ఉందని అనుమానం వస్తే తమకు తెలియజేయాలంటూ, భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన తరువాతి క్షణం నుంచి ఈ-మెయిల్స్ వెల్లువెత్తాయి. ‘blackmoneyinfo@incometax.gov.in’ అనే మెయిల్ కు నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు ఇవ్వాలని మోడీ సర్కారు కోరిన నేపథ్యంలో 72 గంటల వ్యవధిలో 4 వేలకు పైగా మెయిల్స్ వచ్చాయి.
తమ విన్నపానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ మెయిల్స్ అన్నీ పరిశీలిస్తున్నామని, అనుమానం వస్తే, వాటిని పరిశీలిస్తున్నామని, దాడులు జరిపేందుకూ సిద్ధంగా ఉన్నామని సదరు అధికారి తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐయూ (ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్) చర్యలు తీసుకోనుందని వెల్లడించారు.
జన్ ధన్ ఖాతాల్లో చేరిన భారీ మొత్తంలో డబ్బుతో పాటు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు, బ్యాంకు అధికారుల ప్రమేయం తదితరాంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని, బంగారం, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు తదితరాలపైన కూడా మెయిల్స్ అందుకున్నామని ఆర్థిక శాఖ అధికారి స్పష్టం చేశారు. అయితే ప్రజల నుండి ఇంత స్పందన రావడం పట్ల నల్లకుభేరులపై ప్రజలకు ఏ మేరకు ఆగ్రహం ఉందో అవగతమవుతోందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.


