పబ్ లు, పార్టీలు, బాయ్ ఫ్రెండ్స్… అంటూ ఎప్పుడూ మీడియా వర్గాలలో హాట్ టాపిక్ గా ఉండే ‘చెన్నై సోయగం’ త్రిష ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళాలలో అవకాశాలు కనుమరుగు కావడంతో, హీరోయిన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్న త్రిష లేటెస్ట్ గా “మోహిని” సినిమాలో నటించింది.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల కాగా, ఏ మాత్రం ఆకట్టుకొని విధంగా ఉండడం విశేషం. ప్రొడక్షన్ యూనిట్ నిర్మాణ విలువలు తప్ప, ఈ ట్రైలర్ లో కధ పరంగానూ, త్రిష అభినయం పరంగానూ ఏమీ లేదనే చెప్పాలి. ఇంకా విశదీకరించాలంటే… తెలుగు ప్రేక్షకులు త్రిషను ఇలాంటి రోల్స్ లో అస్సలు చూడలేమని గతంలో “నాయకి” సినిమా ద్వారా స్పష్టంగా చెప్పేసారు.
సరిగ్గా అదే తరహాలో ఈ “మోహిని” సినిమా కూడా రూపుదిద్దుకోవడంతో… ఈ ట్రైలర్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రస్తుతానికి తమిళంలో విడుదలైన ఈ ట్రైలర్ తెలుగులో కూడా విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత తెలుగు హక్కులు తీసుకున్న వారు పునరాలోచించుకుంటారా? లేదా అనేది వేచిచూడాలి.



