జెంటిల్మెన్ గేమ్ గా అభివర్ణించే క్రికెట్ గేమ్ లో టీ20 పంచుతున్న మజానే వేరు. టీ20 వెలుగులోకి వచ్చిన తరువాత టెస్టు, వన్డేలు పూర్తిగా వెనుకబడిపోయాయి. టీ20 ఫార్మాట్ మ్యాచ్ జరిగితే చాలు, సూపర్ సక్సెస్ అన్నది రుజువు చేస్తూ తమిళనాడులో జిల్లాల ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ శ్రీనివాసన్ నిర్వహించిన టీ20 టోర్నీ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.
బంతి ఎలా వచ్చినా బౌండరీ లక్ష్యంగా బాదిన ఢిల్లీ యువ ఆటగాడు క్రికెట్ చరిత్రలో అద్భుతాన్ని సాధించాడు. టీ20లో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ సాధించడం అంటేనే అద్భుతం. అలాంటది 21 ఏళ్ల యువకుడు క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమనదగ్గ ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ప్రపంచంలోని ఏ వయసు టీ20లోనైనా ఇంతవరకు ట్రిపుల్ సెంచరీ నమోదు కాలేదు.
తొలిసారిగా అనధికార మ్యాచ్ లో వికెట్ కీపర్ మోహిత్ అల్హావత్ కేవలం 72 బంతులను ఎదుర్కొని 39 సిక్సర్లు, 14 ఫోర్లతో పరుగుల మోత మోగించి 300 పరుగుల అపూర్వమైన రికార్డు సృష్టించాడు. దీంతో అతని జట్టు స్కోర్ ఏకంగా 400 మార్కును దాటింది. అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం 66 బంతుల్లో క్రిస్ గేల్ సాధించిన 175 పరుగులే ఇప్పటి వరకు అత్యధికం.



