చంద్రబాబు తనకు గవర్నర్ గిరి, రాజ్యసభ సీటు ఇవ్వలేదని పార్టీకి మాక్జిమమ్ డామేజ్ చేసి బయటకు వెళ్లిన మోత్కుపల్లి నరసింహులు ఆ తరువాత బీజేపీలో చేరారు. తాజాగా ఆయన బీజేపీ బహిష్కరించిన సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరయ్యి సంచలనం సృష్టించారు. దానితో ఆయన తెరాసలో చేరతారా అనే అనుమానాలు మొదలయ్యాయి.
అయితే సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్లి తెలంగాణ బీజేపీని కాపాడనని మోత్కుపల్లి మీడియాతో చెప్పుకొచ్చారు. ప్రగతి భవన్ సమావేశానికి వెళ్లకపోతే బీజేపీకి అపవాదు వచ్చేదని అన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను పోగొట్టేప్రయత్నం చేశానని మోత్కుపల్లి నరసింహులు అన్నారు.
అంతటితో ఆగకుండా తనను సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని, కేసీఆర్ తనకు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. బీజేపీలో చేరాకా మోతుకుపల్లి పార్టీలో యాక్టీవ్ గా ఉన్నది లేదు. చాలా మందికి ఆయన పార్టీలో ఉన్న విషయమే తెలీదు.
పార్టీ లైన్ ని ధిక్కరించి సమావేశానికి వెళ్లి… తాను బీజేపీని కాపాడానని చెప్పుకోవడం విశేషం. అంతటితో ఆగకుండా బీజేపీ పై దళిత వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉందని డైరెక్ట్ గానే ఒప్పుకున్నారు. ఇటువంటి మాటలు, చేష్టలు ఏ విధంగా పార్టీకి మేలు చేస్తాయో ఆయనకే తెలియాలి. ఇంకో విశేషం ఏమిటంటే మోత్కుపల్లి టీడీపీలో ఉండగా కేసీఆర్ పై ఒంటి కాలి మీద లేచే వారు.



