రోహిత్, విరాట్ ల వీరవిహారం… ధోని వరల్డ్ రికార్డ్..!

MS Dhoni - 300 ODI not Outశ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ను ఇప్పటికే 3-0తో కైవసం చేసుకున్న టీమిండియా, దాదాపుగా నాలుగవ వన్డేను కూడా సొంతం చేసుకున్నట్లే భావించవచ్చు. ఈ సారి తొలుత బ్యాటింగ్ చేసి 375 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఒకానొక దశలో అయితే 400 పైగా పరుగులను అవలీలగా చేరుకుంటుందని భావించినప్పటికీ, విరాట్ కోహ్లి పతనం తర్వాత వడివడిగా వికెట్లు పతనం కావడంతో 375 పరుగులకే పరిమితం అయ్యింది. ప్రస్తుతం శ్రీలంక జట్టుకున్న ఫాం చూస్తే ఈ స్కోర్ దరిదాపుల్లోకి రావడం కూడా అసాధ్యం అని చెప్పేయొచ్చు.

టాస్ గెలిచిన టీమిండియా ఈ సారి బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్ శిఖర్ ధావన్ 4 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జతకలసిన కెప్టెన్ విరాట్ కోహ్లి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. విరాట్ ఔటయ్యే సమయానికి 29.3 ఓవర్లలో 225 పరుగులతో టీమిండియా ఉందంటే, ఆ తర్వాత పతనం ఎలా జరిగిందో ఊహించుకోవచ్చు. ఇక విరాట్ ఉండి ఉంటే… అన్న ఊహలకు అంచనాలు కూడా సరిపోవేమో… అన్నంతగా చెలరేగిపోయాడు. కేవలం 96 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 పరుగులు చేసి ఔటయ్యాడు.

ADVERTISEMENT

మరో ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ ఈ సిరీస్ లో వరుసగా రెండో సెంచరీని నమోదు చేసి దుమ్ముదులిపాడు. కేవలం 88 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసిన రోహిత్ శర్మ నాలుగవ వికెట్ గా వెనుదిరగడంతో స్కోర్ బోర్డు బాగా నెమ్మదించింది. చివర్లో మనీష్ పాండే 42 బంతుల్లో 50 పరుగులు చేయగా, 300వ వన్డే ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని 42 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ నాటౌట్ తో వన్డేలలో అత్యధిక నాటౌట్లుగా నిలిచిన బ్యాట్స్ మెన్ గా ధోని 73 సార్లతో పొల్లాక్ రికార్డును తిరగరాశాడు.

ADVERTISEMENT
Latest Stories