2016 ఐపీఎల్ సీజన్ నుండి ధోని టీం రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అధికారికంగా అవుట్ అయ్యింది. ఆడిన 11 మ్యాచ్ లలో కేవలం మూడంటే మూడే విజయాలు దక్కించుకున్న పూణే జట్టు, మంగళవారం నాడు జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలోనూ ఓటమి పాలయ్యి, అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇక, మిగిలిన 3 మ్యాచ్ లు ధోని జట్టుకు నామమాత్రమే అయినా, ఇతర జట్లకు మాత్రం అవి కీలకం కానున్నాయి.
విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ లో కేవలం 138 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది ధోని జట్టు. అతి జాగ్రత్తకు పోతే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో పూణే జట్టు చెప్పకనే చెప్పింది. రన్ రేట్ పెరిగిపోతున్న సమయంలోనూ ధోని అతి జాగ్రత్త బ్యాటింగ్ కొంపముంచిందని అభిమానులు ధోని బ్యాటింగ్ పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో షాట్లు కొట్టాల్సిన సమయంలో… ధోని సింగిల్స్, డబుల్ పరుగులకు మాత్రమే మొగ్గు చూపి మ్యాచ్ ను చేతులారా సన్ రైజర్స్ చేతిలో పెట్టారని మండిపడుతున్నారు.
ధోని ప్రభావంతో మ్యాచ్ లో గెలుపొందిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. ఆడిన 10 మ్యాచ్ లలో 7 విజయాలు సొంతం చేసుకుని, మెరుగైన రన్ రేట్ తో గుజరాత్ ను రెండవ స్థానానికి నెట్టి అగ్ర స్థానంలో నిలిచింది. ఇక, నేడు జరగనున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోహ్లి సేన పీకపై కత్తి పెట్టినట్లే. ఇరు జట్లు తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో రసవత్తరంగా సాగుతుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



